తెలంగాణ

telangana

తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులే తప్పుడు పనికి పాల్పడ్డారు.. అసలు విషయం తెలిస్తే.!

By

Published : Oct 4, 2022, 2:33 PM IST

శాంతిభద్రతలు.. ప్రజల మానప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారులే ఘర్షణకు దిగారు. తమకు న్యాయం చేయండంటూ పీఎస్​లకు వచ్చే వారికి మంచి చెడులు చెప్పేవారే తమ విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయారు. గౌరవప్రదమైన పోలీస్​ వృత్తిలో ఉంటూ పాడు పనులకు పాల్పడ్డారు. దాంతో ముగ్గురు సీఐల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Intimidation of a police officer
Intimidation of a police officer

తప్పు చేస్తే శిక్షించాల్సిన పోలీసులే తప్పుడు పనికి పాల్పడ్డారు. రోజూ స్టేషన్​కు అలాంటి గొడవల విషయంలో దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాల్సిన రక్షక భటులే తప్పు చేశారు. పోలీసు అధికారి కుటుంబ విషయంలో మరో పోలీసు అధికారి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో పాటు అతణ్నే బెదిరించాడు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండలో ఉంటున్న పోలీసు అధికారి వేరే జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన సతీమణి సైతం నగరంలో పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనతోపాటు పనిచేస్తున్న మరో అధికారికి ఆమె తరచూ ఫోను చేస్తుండడంతో గమనించిన భర్త పలుసార్లు హెచ్చరించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్యతో మాట్లాడుతున్న అధికారిని కూడా ఆయన మందలించారు. అయినప్పటికీ వారు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు.

సోమవారం తాను లేని సమయంలో ఆ అధికారి ఇంటికి వచ్చాడని తెలుసుకొని మరోసారి హెచ్చరించారు. ఇది సహించని ఆ పోలీసు అధికారి ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అతడు సుబేదారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ముగ్గురూ గౌరవప్రదమైన పోలీస్ శాఖలో సర్కిల్ ఇన్​స్పెక్టర్లు కావడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details