తెలంగాణ

telangana

చింతపల్లి ఘటనలో ఇంకా దొరకని మృతుడి మొండెం.. ప్రత్యేక బృందాలతో గాలింపు

By

Published : Jan 12, 2022, 3:26 PM IST

Head Found WithOut Body

Head found without body: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్‌ మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద తల మాత్రమే దొరికిన ఘటనలో... విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన జైహింద్‌ నాయక్‌ను ఓ ముఠా వారం క్రితమే కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది. ఇంకా మొండెం దొరకకపోగా ఇందుకోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

చింతపల్లి ఘటనలో ఇంకా దొరకని మృతుడి మొండెం

Head found without body: ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్న జైహింద్‌ నాయక్‌... ఏడాదిన్నర క్రితమే మతిస్తిమితం కోల్పోయాడు. తుర్కయాంజల్‌లోని ఓ ఆలయం వద్ద భిక్షాటన చేస్తూ జీవనం గడుపుతున్నాడు. ఆ ప్రాంతంలో భిక్షాటన చేసేవాళ్లు, ఇతర వ్యక్తులను పోలీసులు విచారించగా... సదరు వ్యక్తి వారం నుంచి కనిపించడం లేదని వారు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఈ నెల 2 నుంచి జైహింద్‌ తుర్కయాంజల్‌లో లేరని, అతడితో పాటూ ఉంటున్న మరో వ్యక్తితో కలిసి... ఓ వాహనంలో వెళ్లినట్లు పోలీసులకు చెప్పారని సమాచారం. దీని ప్రకారం పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు, హైదరాబాద్‌- సాగర్‌ రహదారిపై ఉన్న దుకాణాల యజమానులు, ఇతర ఆధారాలతో కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ హత్య సోమవారం ఉదయమే వెలుగులోకి వచ్చినా ఇప్పటివరకు మృతుడి మొండెం దొరక్కపోవడంతో... ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజల్, చింతపల్లి, దేవరకొండ ప్రాంతాల్లో గాలింపు చేపట్టాయి.

గుప్త నిధుల కోసమే.?

గతంలోనూ దేవరకొండ, నాంపల్లి, చింతపల్లి మండలాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో... పాత నేరస్థులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తుర్కయంజాల్‌కు వెళ్లి జైహింద్‌నాయక్‌ను ఇంటికి రమ్మని బతిమాలగా.. రానని చెప్పినట్లు మృతుడి తండ్రి తెలిపాడు. గుప్త నిధుల కోసమే తన కుమారుడిని హత్య చేశారని ఆయన అనుమానించారు.

నా దారి నాది.. మీ దారి మీది

'ఏడాదిన్నర క్రితం మా అబ్బాయి మతిస్తిమితం కోల్పోయాడు. మా చెల్లి కొడుకు ద్వారా తుర్కయాంజల్‌లో ఉంటున్నట్లు తెలిసింది. దీంతో నాలుగైదు సార్లు వెళ్లి ఇంటికి రమ్మని బతిమిలాడాం. రాలేదు. ఆరు నెలల క్రితం మా బిడ్డ పెళ్లి ఉండటంతో ఇంటికి రమ్మని మరోసారి కోరాం. అయినా మేం ఎవరో తెలియనట్లే ప్రవర్తించాడు. నేనిక్కడే ఉంటా.. నా దారి నాది.. మీ దారి మీది.. ఇంటికి రాను అన్నాడు. చివరగా మూడు నెలల క్రితం చూశాం. మా అబ్బాయి ఆరడుగుల ఎత్తు ఉంటాడు, పెళ్లి కాలేదు. ఆదివారం హత్యకు గురికావడంతో గుప్త నిధుల కోసమే మా కుమారుడిని చంపినట్లు మేం అనుమానిస్తున్నాం.' -శంకర్‌నాయక్‌, మృతుడి తండ్రి

గతంలోనూ ఇలాంటివి

మతి స్తిమితంలేని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి, తల తెగ్గోసి తెచ్చి మహంకాళీ అమ్మవారి పాదాల ఎదుట పడేసిన ఉదంతం నల్గొండ జిల్లాలో కలకలం సృషించింది. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా? మరేదైనా జరిగిందా? అనేది తేలాల్సి ఉంది. ఈ హత్య నరబలేననే అనుమానాలను పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. గతంలో ఇదే జిల్లాలోని శాలిగౌరారం, నాంపల్లి మండలం ముష్టిపల్లి, దేవరకొండ గుట్టల్లో గుప్త నిధుల కోసం నరబలి ఘటనలు జరిగిన నేపథ్యంలో పాత నేరస్థుల గురించి ఆరా తీస్తున్నారు.

డాగ్​స్క్వాడ్​ తనిఖీలు

తల ఉన్నచోట రక్తపు ఆనవాళ్లు లేకపోవడం, తలకు గడ్డి, మట్టి అతుక్కుని ఉన్న నేపథ్యంలో ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారనే నిర్ధారణకు పోలీసులు వచ్చినట్టు తెలిసింది. మరోవైపు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఆధారాలు సేకరించాయి. డాగ్‌ స్క్వాడ్‌ విరాట్‌నగర్‌ కాలనీ నుంచి ఒకటిన్నర కి.మీ.దూరంలో ఉన్న కుర్మేడ్‌ గ్రామంలో సంచరించి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోకి వెళ్లి కొద్దిసేపు అక్కడే సంచరించింది. మరోవైపు నల్గొండ సీసీఎస్‌ డీఎస్పీ మొగులయ్య పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల బృందం నిందితులను గుర్తించే క్రమంలో సీసీ ఫుటేజీలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది.

ఇదీ చదవండి:అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?

ABOUT THE AUTHOR

...view details