తెలంగాణ

telangana

ఐదో పెళ్లి చేసుకున్న భర్త... పోలీసులను ఆశ్రయించిన నాలుగో భార్య...

By

Published : May 23, 2022, 10:12 PM IST

మ్యాట్రిమోని ద్వారా అమ్మాయితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. వారి కుమార్తెను కళ్లలో పెట్టుకుని చూసుకుంటానని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు. బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. భార్య గర్భవతి అయ్యాక తల్లిగారి ఇంట్లో దింపి వెళ్లాడు. కుమారుడు పుట్టాక కూడా భర్త తిరిగి రాకపోవడంతో అప్పుడు బయటపడింది ఆ ప్రబుద్ధుని అసలు బాగోతం... అసలేం జరిగిందంటే?

Saganamoni Maddileti
సగనమోని మద్దిలేటి

ప్రపంచ మొత్తం భారత వైవాహిక బంధానికి ఆకర్షితులవుతుంటే... కొన్ని ఘటనలు మన సంస్కృతికి మచ్చ తెస్తున్నాయి. మ్యాట్రిమోని ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకోవడం.. ఉద్యోగం, ఆస్తి ఉందని.. మంచిగా చూసుకుంటానని మాయ మాటలు చెప్పడం... అది నమ్మి యువతులు మోసపోతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఓ దగ్గర మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిదే పెద్దపల్లి జిల్లా మంథనిలో వెలుగులోకి వచ్చింది. మ్యాట్రిమోని ద్వారా అమ్మాయిలతో పరిచయాలు ఏర్పరుచుకుని ఐదు వివాహాలు చేసుకున్న ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతాన్ని అతని నాలుగో భార్య కనిపెట్టింది. దాంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించింది.

పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన ఓ యువతితో 6 నెలల క్రితమే ఆ మోసగాడికి ఐదో వివాహం జరిగింది. వనపర్తి జిల్లా పాన్​గల్ మండలం మంగళపల్లికి చెందిన సగనమోని మద్దిలేటి అలియాస్ మధు అనే వ్యక్తి సుమారు 4 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు.

గర్భం దాల్చగానే మధు ఆమెను పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. బాబు పుట్టిన తర్వాత కూడా రాకపోవడంతో ఆమె భర్త కోసం వెతకసాగింది. మంథనిలో మరో వివాహం చేసుకున్నాడని తెలుసుకొని అక్కడకు చేరుకుని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. తన కంటే ముందు మరో ముగ్గురిని ఇలాగే పెళ్లిచేసుకొని మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. తనకు పుట్టిన బాబుకి గుండెలో రంధ్రం ఉందని.. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు న్యాయం చేయాలని వాపోయింది. తనకు జరిగిన అన్యాయం మరే మహిళకు జరగకుండా... అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న మద్దిలేటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details