తెలంగాణ

telangana

farmers suicide: రుణాలు తీర్చలేమనే వ్యధతో ఐదుగురు రైతుల ఆత్మహత్య

By

Published : Sep 14, 2021, 8:44 AM IST

family suicide
family suicide ()

ఆకలి తీర్చే అన్నదాతకు బతుకు భారమైపోతుంది. మట్టినే నమ్ముకున్న రైతు... సాగు సాగరాన్ని దాటలేక బలవంతంగా తనువు చాలిస్తున్నాడు. పంటకు పట్టిన చీడను వదిలించడానికి తెచ్చిన పురుగుమందు అన్నదాతకు ఆయువు తీస్తుంది. సాగులో కష్టాలు, అప్పుల బాధను తాళలేక రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

సాగులో వరసగా నష్టాలు, అప్పుల బాధతో వికారాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం కౌఠ గ్రామానికి చెందిన ఇట్టెడి రమణారెడ్డి(52) తనకున్న 10 ఎకరాల భూమిలో సోయా, కౌలుకు తీసుకున్న 20 ఎకరాల్లో పత్తి, కంది సాగు చేశారు. వీటి సాగుకు రూ.13 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. రెండేళ్లుగా సరైన దిగుబడులు రావడం లేదు. అప్పులు ఎలా తీర్చాలని ఆందోళనకు గురవుతున్న రమణారెడ్డి.. సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు బోథ్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు.

వరుణుడి దెబ్బకు

వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామానికి చెందిన కీసరి సాయిలు(59) ఎకరం పొలంలో వరి సాగు చేశారు. భారీ వర్షాలకు పంట కొట్టుకుపోయింది. మూడేళ్లుగా దిగుబడులు సరిగా రాకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.లక్ష వరకు పేరుకుపోయింది. వరుస నష్టాల వల్ల అప్పు తీర్చలేనన్న ఆందోళనతో ఆదివారం పురుగుల మందు తాగేశారు. కుటుంబ సభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

పత్తి సాగు ముంచింది

నిర్మల్‌ జిల్లా కుంటాల మండలం రాజాపూర్‌ తండాకు చెందిన జాదవ్‌ జితేందర్‌(27) ఎకరం భూమిలో పత్తి సాగు చేశారు. ఇటీవలి వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతింది. రూ.4 లక్షల అప్పులు తీర్చలేనేమోనన్న బెంగతో సోమవారం పొలంలోనే పురుగుమందు తాగారు. తండ్రి గమనించి భైంసా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.

పిల్లలు గమనించకుండా.. తనువు చాలించారు

వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం తిమ్మాపూర్‌ (అన్నారంగడ్డ) గ్రామానికి చెందిన జిల్లెల యాదయ్య(38), యాదమ్మ(35) దంపతులు ఎకరంన్నర పొలంలో సాగు కోసం చేసిన అప్పులు భారం కావటంతో సోమవారం రాత్రి పిల్లలు గమనించకుండా ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. కుటుంబసభ్యులు వికారాబాద్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతిచెందారు. వీరికి రూ. నాలుగు లక్షల వరకు అప్పులున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:చితి మంటలను చూసైనా స్పందించరా: రఘునందన్​ రావు

ABOUT THE AUTHOR

...view details