తెలంగాణ

telangana

వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందన్న కోపంతో మహిళపై కత్తితో దాడి..

By

Published : May 27, 2022, 3:12 PM IST

Updated : May 27, 2022, 5:46 PM IST

Ex-boyfriend stabs young woman at kanchanbhag Hyderabad
Ex-boyfriend stabs young woman at kanchanbhag Hyderabad

15:10 May 27

మహిళకు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి..

హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌ పీఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే.. బిజీగా ఉన్న రోడ్డులో.. అందరూ చూస్తుండగానే.. మహిళపై కిరాతకంగా కత్తితో దాడి చేశాడు ఓ దుండగుడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో.. మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ నిందితుడు షేక్​నసీరుద్దీన్​(32)గా పోలీసులు గుర్తించారు. హఫీజ్ బాబానగర్​లోని ప్రభుత్వ పాఠశాల పక్కనే నసీరుద్దీన్ నివాసముంటున్నాడు. అదే కాలనీలో సైదానూర్​ బాను(40) ఉంటోంది. సైదానూర్​ బానుకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా.. ఆమె భర్త ఇంతియాజ్ మూడేళ్ల క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఓ దుకాణంలో పనిచేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఒకే కాలనీలో ఉండటం వల్ల నసీరుద్దీన్​తో సైదానూర్ బానుకు పరిచయం ఏర్పడింది.

పరిచయాన్నే అదునుగా తీసుకుని నసీరుద్దీన్​.. కొంతకాలంగా వివాహేతర సంబంధం కోసం వేధిస్తున్నాడు. ఎంత ఒత్తిడి చేసినా.. సైదానూర్​ నిరాకరించటంతో కోపం పెంచుకున్నాడు. ఈక్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సైదానూర్​ బానుపై వెనక నుంచి వచ్చిన నసీరుద్దీన్ కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా దాడి చేయటంతో సైదానూర్​ కుప్పకూలింది. అక్కడే ఉన్న స్థానికులకు ఏం జరుగుతుందో తెలిసేలోపు.. కిందపడిని బాధితురాలిని నిందితుడు కత్తితో పదిసార్లు అతిదారుణంగా పొడిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిని కూడా కత్తితో బెదిరించాడు. హడలిపోయిన స్థానికులు వెనక్కితగ్గారు. సైదానూర్​ చనిపోయిందని భావించిన నసీరుద్దీన్​ అక్కడి నుంచి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని పోలీసులు.. సమీపంలో ఉన్న ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. మహిళకు తీవ్ర రక్తస్రావం కావడంతో... అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. అంతర్గత గాయాలు కావడంతో పాటు, ఎక్కువగా రక్తం పోవటం వల్ల 24 గంటలు గడిస్తే కానీ.. ఆమె పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేయడానికి ద్విచక్రవాహనంపై వచ్చిన నసీరుద్దీన్​.. పారిపోయే క్రమంలో బైక్​ను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఈ ద్విచక్రవాహనం నికత్ బేగం అనే మహిళ పేరు మీద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ బైక్​ మీద రెండేళ్లుగా 9 వేలకు పైగా జరిమానాలున్నట్టు తెలిపారు. పరారైన నిందితుని కోసం.. పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరించారు. దాడికి సంబంధించిన సీసీకెమెరా దృశ్యాలు ఇప్పుడు వైరల్​గా మారాయి.

ఇవీ చూడండి:

Last Updated :May 27, 2022, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details