తెలంగాణ

telangana

ముసద్దీలాల్ జువెల్లర్స్​లో ముగిసిన ఈడీ సోదాలు.. భారీగా బంగారం, వజ్రాలు సీజ్‌

By

Published : Oct 18, 2022, 6:15 PM IST

ED raids in Musaddilal Gems and Jewellery: ముసద్దీలాల్ జెమ్స్ ఆండ్ జువెల్లర్స్ షోరూంలో రెండు రోజుల పాటు ఈడీ చేపట్టిన సోదాలు ముగిశాయి. విజయవాడ, హైదరాబాద్​లోని మూడు షోరూమ్​లలో బంగారు, వజ్రాభరణాలు, ఇతర కీలక పత్రాలను సీజ్ చేశారు. బంగారు, వజ్రాభరణాలను కోఠిలోని ఎస్బీఐ ట్రెజరీలో డిపాజిట్ చేశారు.

ED raids
ED raids

ED raids in Musaddilal Gems and Jewellery: ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్​లో ఈడీ సోదాలు ముగిశాయి. రెండు రోజుల పాటు కొనసాగిన సోదాల్లో ఈడీ అధికారులు భారీ ఎత్తున బంగారం సీజ్ చేశారు. హైదరాబాద్​లోని ఎర్రమంజిల్, సికింద్రాబాద్​తో పాటు విజయవాడలోని ముసద్దీలాల్ జువెల్లర్స్​లో దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలతో పాటు ఎంబీఎస్ జువెల్లర్స్ డెరైక్టర్లు అయిన సుఖేష్‌ గుప్తా, అనురాగ్‌ గుప్తా బినామీలకు చెందిన రూ.50 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు.

పదేళ్ల క్రితం ఎంబీఎస్ జువెల్లర్స్, దాని అనుబంధ సంస్థలు కలిసి ఎంఎంటీసీ నుంచి భారీగా బంగారాన్ని అరువుగా తీసుకుంది. బంగారు వ్యాపారస్థులు రాయితీ మీద బంగారాన్ని మెటల్స్ ఆండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ విక్రయిస్తోంది. సదరు కార్పొరేషన్ నుంచి ఎంబీఎస్ జువెల్లర్స్ డైరెక్టర్లు దాదాపు రూ.500 కోట్లకు పైగా బంగారాన్ని తీసుకున్నారు. డబ్బులు చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఎంఎంటీసీకి భారీగా బకాయిపడ్డారు. ఎంఎంటీసీ లిమిటెడ్ వన్ టైం సెటిల్ మెంట్ అవకాశాన్ని ఎంబీఎస్ జువెల్లర్స్​కు కల్పించినా.. దాన్ని కూడా ఉపయోగించుకోలేదు. దీంతో అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎంఎంటీసీ లిమిటెడ్​లో పనిచేసే అధికారులే ఎంబీఎస్ జువెల్లర్స్ డైరెక్టర్లకు అనుకూలంగా వ్యవహరించి డబ్బులు ఇవ్వకున్నా భారీగా బంగారు ఇచ్చినట్లు గుర్తించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంగారు విక్రయాల ద్వారా వచ్చిన లాభాలతో పలుచోట్ల పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. గతేడాది ఏప్రిల్​లో ఎంబీఎస్ జువెల్లర్స్​కు చెందిన రూ.323 కోట్లను జప్తు చేశారు. మరో 200 కోట్లకుపైగా ఎంఎంటీసీకి ఎంబీఎస్ సంస్థ నుంచి డబ్బులు రావాల్సి ఉంది.

ఈ డబ్బులు చెల్లించకుండా ఎంబీఎస్ సంస్థ వేరే పేర్లతో వ్యాపారం నిర్వహిస్తోందని తెలిసింది. దీంతో మళ్లీ రంగంలోకి దిగిన ఈడీ.. నిన్న, ఇవాళ సోదాలు జరిపింది. ఎంబీఎస్ డైరెక్టర్లు అయిన సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా వేరే పేర్లమీద బంగారు వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ అధికారులు.. ఆ మేరకు ముసద్దీలాల్ జువెల్లర్స్​పై దాడులు నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్​లోని మూడు షోరూంలలో బంగారు, వజ్రాభరణాలు, ఇతర కీలక పత్రాలను సీజ్ చేశారు. బంగారు, వజ్రాభరణాలను కోఠిలోని ఎస్బీఐ ట్రెజరీలో డిపాజిట్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details