తెలంగాణ

telangana

వంశీకృష్ణ వలలో వెయ్యి మందికి పైగా ఆడవాళ్లు

By

Published : Jul 21, 2022, 10:02 AM IST

Cyber Cheater Vamshi Krishna
Cyber Cheater Vamshi Krishna

Cyber Cheater Vamshi Krishna : అతడి పేరు వంశీకృష్ణ. రెండో పెళ్లికి సిద్ధమైన మహిళలకు వల వేసి మోసగించడమే అతడి వృత్తి. వెయ్యి నుంచి 1500 మంది ఆడవాళ్లు అతడి మాయలో పడి మోసపోయారు. ఇప్పటికి వారి నుంచి వంశీ.. దాదాపు 50 కోట్ల రూపాయలు కాజేశాడు. చాలా రోజులుగా ఈ మాయగాడి కోసం వెతుకుతున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు వంశీని అరెస్టు చేశారు.

Cyber Cheater Vamshi Krishna : ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో.. రెండోపెళ్లికి సిద్ధమైన మహిళలను మోసగించిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రామచంద్రరావుపేటకు చెందిన జోగాడ వంశీ కృష్ణ(31) మోసాలు పోలీసుల దర్యాప్తులో మరిన్ని బయటకొచ్చాయి. బీటెక్‌ చేసిన అతడు ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాద్‌ కూకట్‌పల్లి చేరి, ఆరేళ్ల వ్యవధిలో సుమారు 1000-1500 మంది యువతులు, మహిళలను మోసగించినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారి నుంచి రూ.40-50 కోట్లు కొట్టేసినట్లు అంచనా కడుతున్నాయి. అతడికి హర్ష, హర్షవర్ధన్‌, చెరుకూరి హర్ష అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. గత మే నెలలో వంశీకృష్ణ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. తాజాగా హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

Cyber fraud Vamshi Krishna : 2014లో హైదరాబాద్‌కు వచ్చిన వంశీకృష్ణ తొలుత కూకట్‌పల్లిలోని హోటల్‌లో పనిచేశాడు. 2015లో క్రికెట్‌ పందేలకు అలవాటుపడ్డాడు. 2016లో జాబ్‌కన్సల్టెన్సీ/ట్రావెల్‌ ఆఫీసులో చేరాడు. 10 మంది యువకులకు ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసగించిన కేసులో అరెస్ట్‌ అయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక.. మాధురి చౌకి, గాయత్రి.. శ్వేత, స్వాతిక-జెస్సీ, హర్ష కూల్‌ 94 పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచాడు. మహిళలు, యువతులకు తననుతాను యువతిగా పరిచయం చేసుకునేవాడు.

సంపాదనలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తాడంటూ మారు పేర్లతో ఉన్న ఖాతాల నుంచి తనపై తానే పొగడ్తల వర్షం కురిపించుకునేవాడు. ఇది నిజమని 1000-1500 మందిని నమ్మించాడు. ఉద్యోగం, ఉపాధి, సేవా కార్యక్రమాలంటూ ఒక్కొక్కరి నుంచి పెద్దమొత్తంలో గుంజేవాడు. పరిచయమైన అమ్మాయిలు/మహిళలు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలిస్తే వారికి వెంటనే రూ.1-2లక్షలు ఉదారంగా ఇచ్చేవాడు.

దీంతో అతడి గురించి.. వారే ప్రచారం చేసేవారు. ఇలా ఆరేళ్ల వ్యవధిలో ఇంతమందిని మోసగించగలిగాడని అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిందితుడి బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ.4కోట్ల నగదు లావాదేవీలను స్తంభింపజేశారు. రిమాండ్‌లో ఉన్న అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరించాలని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details