తెలంగాణ

telangana

పిల్లలు లేరనే వంకతో.. తోడికోడళ్ల దారుణ హత్య

By

Published : Dec 15, 2022, 10:16 PM IST

COUSIN SISTERS MURDER IN KURNOOL: సమాజంలో మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో పిల్లల కోసం కట్టుకున్న భార్యలనే కడతేర్చారు సొంత అన్నదమ్ములు. పిల్లలు పుట్టలేదనే కారణంతో తమ బిడ్డలను హత్య చేశారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

COUSIN SISTERS MURDER IN KURNOOL
COUSIN SISTERS MURDER IN KURNOOL

పిల్లలు లేరనే వంకతో.. తోడికోడళ్ల దారుణ హత్య

COUSIN SISTERS MURDER: ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా నన్నూరులో తోడికోడళ్లను చంపేసిన కిరాతకులు వాళ్ల భర్తలేనని తెలుస్తోంది. పిల్లలు పుట్టడం లేదంటూ భార్యలను హతమార్చి మరో పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధితోనే.. పథకం ప్రకారం దురాగతానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ ఇదే విషయం నిర్ధరణ అయినట్లు సమాచారం. భర్తలే తమ కూతుళ్లను బలి తీసుకున్నారని ఆరోపించిన మృతురాళ్ల తల్లిదండ్రులు, బంధువులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో బుధవారం తోడికోడళ్ల దారుణహత్య తీవ్ర కలకలం రేపింది. పొలం పనులకు వెళ్లిన తోడికోడళ్లు రామేశ్వరి, రేణుక విగతజీవులుగా పడి ఉండటం చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. నన్నూరుకు చెందిన కురువ గోగన్నకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రామగోవిందుకు మిడుతూరు మండలం గుడిపాడుకు చెందిన రామేశ్వరితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. చిన్న కుమారుడు చిన్న రామగోవిందు.. కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన రేణుకను పెళ్లి చేసుకున్నాడు.

ఏళ్లు గడిచినా రెండు జంటలకూ పిల్లలు పుట్టలేదు. బుధవారం పశువుల మేత కోసం రామేశ్వరి, రేణుకను తీసుకెళ్లిన పెద్దగోవిందు వారిని పొలంలో వదిలిపెట్టి వచ్చాడు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా తోడికోడళ్లిద్దరూ ఇంటికి రాలేదు. దీనిపై కుటుంబసభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొలంలో గాలించిన పోలీసులు ఇద్దరూ రక్తం మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

జంట హత్యలపై విచారణ చేపట్టిన పోలీసులు.. తోడికోడళ్లను అతి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. కర్రలతో కొట్టి, కొడవళ్లతో గొంతులు కోసి, కళ్లు పొడిచి, బండరాళ్లతో తలపై మోది చంపేసినట్లు తేలింది. జంట హత్యలు వెలుగుచూసిన సమయంలోనే గుండెపోటు వచ్చిందంటూ కర్నూల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన గోగన్న.. ఆయన ఇద్దరు కుమారులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తామే హత్యలు చేసినట్లు తండ్రీకుమారులు ప్రాథమికంగా అంగీకరించారని తెలిసింది. పిల్లలు పుట్టలేదని హత్య చేశారా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తండ్రీకుమారులే పథకం ప్రకారం తమ కుమార్తెలను హతమార్చారని.. మృతురాళ్ల తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాళ్ల కుటుంబాలను తెలుగుదేశం నేత గౌరు చరిత పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మరెవరూ ఇలాంటి కిరాతకానికి పాల్పడకుండా... నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. తోడికోడళ్ల హత్యలతో నన్నూరు గ్రామం ఉలిక్కిపడింది. భర్తలే కాలయముళ్లై భార్యల్ని చంపేశారనే సమాచారంతో ఊరంతా కలత చెందింది.

"నా కూతురికి జరిగిన ఆన్యాయం ఎవరికి జరగకూడదు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. పిల్లలు కావాలని నా కూతుర్ని ఇబ్బంది పెట్టారు. పెళ్లి అయి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది."- మృతురాలు రేణుక తల్లి.

"నా కూతురుకు పిల్లలు లేరు. పిల్లలు కావాలని ఇబ్బంది పెట్టెవారు. పిల్లల కోసం ఆసుపత్రికి చూపిస్తున్నాము."- మృతురాలు రామేశ్వరి తల్లి.

" అతి చిన్న వయస్సు గల ఇద్దర్నివారి కుటుంబ సభ్యులే అతి కిరాతకంగా హత్య చేయటం దారుణం. ఇది హేయమైన చర్య. వారిని కాదని చెప్పి వదిలేసి ఉంటే.. వారు బతికేవారు. ఇలా చంపటం దారుణం."- గౌరు చరితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details