తెలంగాణ

telangana

new couple suicide: ఒక్కటై బతకాలనుకున్న నవ జంట ... కలసి మరణించారు

By

Published : Oct 28, 2021, 7:41 AM IST

వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఒక్కటై బతకాలని నిర్ణయించుకున్నారు. జీవితంలో స్థిరపడకపోయినా..పెద్దలను కాదని దూరంగా వెళ్లి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు... భవితపై బెంగో.. కన్నోళ్లు క్షమిస్తారనే ఆశో.. 50 రోజుల తర్వాత సొంతూరొచ్చారు.. అంతా అక్కున చేర్చుకుంటారని భావించారు.. అందరితో కలిసి జీవించాలని తపించారు. కానీ వీరు ఒకలా తలిస్తే, విధి మరోలా మరణ శాసనం రాసింది. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. నిండు నూరేళ్లూ జీవిద్దామనుకున్న నవ దంపతులు అర్ధంతరంగా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.

new couple suicide
new couple suicide

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీశ్‌ (29), రుంకు దివ్య (20) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోరనే ఉద్దేశంతో... వారిని కాదని ఇటీవల స్నేహితుల సమక్షంలో అన్నవరం ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం స్వగ్రామానికి రాకుండా విశాఖపట్నంలో కాపురం పెట్టారు. ఇలా జీవితం సాగిపోతున్న క్రమంలో కన్నవారి వైపు మనసు మళ్లింది. వారిని చూసొద్దామని ఇద్దరూ సంతోషంగా బుధవారం రోజు గ్రామంలో అడుగుపెట్టారు. పెళ్లై 50 రోజులు కావటంతో కోపతాపాలు మరిచిపోతారని, అంతా ఆదరిస్తారని భావించారు. తప్పు చేశానమ్మా.. అంటూ తల్లిని పట్టుకుని హరీశ్‌ ఏడ్చేశాడు. తండ్రి లేని బిడ్డ అని ముద్దుగా చూసుకున్న ఆ తల్లి కుమారుడిని ఓదార్చి ఇంట్లోకి తీసుకెళ్లింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దంపతులిద్దరూ పై అంతస్తులోకి వెళ్లారు. చరవాణి కింద అంతస్తులో ఉండిపోవటంతో దాన్ని తీసుకుని వెళ్లిన ఒక యువకుడు ఇద్దరూ రెండు ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఉన్న విషయాన్ని గమనించి కేకలు వేశాడు. వెళ్లి చూసేసరికి ఇద్దరూ విగతజీవులుగా కన్పించారు.

జీవితంలో ఎదగాలని

ఎంసీఏ చదివిన హరీశ్‌ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. విశాఖలో శిక్షణ తీసుకుంటున్నాడు. దివ్య ఈ ఏడాది డిగ్రీ ఫైనలియర్‌ పరీక్షలు రాసింది. 50 రోజుల కిందట పరీక్షలు రాసేందుకని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కాగా వీరి బలవన్మరణానికి కారణం అంతుబట్టడం లేదు. పాలకొండ సీఐ శంకరరావు, రేగిడి ఎస్‌ఐ మహమ్మద్‌ అలీ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. బంధువులు, కన్నవారి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని ఎస్‌ఐ తెలిపారు.

కన్నవారికి కడుపు కోత

ఇద్దరు తీసుకున్న నిర్ణయం కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. తండ్రి చిన్నంనాయుడు చనిపోయినా..కొడుకు హరీశ్‌ను ప్రయోజకుడిని చేయాలని తల్లి వసంతమ్మ కలలుకన్నది. అందుకు తగినట్లే ఉన్నతంగా చదివించింది. ఎంసీఏ వరకు కొడుకు చదవటంతో ఉన్నత ఉద్యోగం వస్తుందని మురిసిపోయింది. ఇంతలో ఇలా జరిగిపోవటంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. అన్న పుట్టిన రోజు వేడుకైనా గుర్తు రాలేదా అంటూ దివ్య తల్లిదండ్రులు మంజుల, శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమయ్యారు. దివ్య సోదరుడు వినీత్‌ పుట్టినరోజు శుక్రవారం కావడంతో వేడుక చేయాలని అనుకున్నారు. మృతదేహాలను రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Wife caught Husband: భర్త వివాహేతర సంబంధం.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య

ABOUT THE AUTHOR

...view details