తెలంగాణ

telangana

తండ్రితో బైకుపై వెళ్తుండగా... మాంజా కోసుకుపోయి చిన్నారికి తీవ్ర గాయాలు

By

Published : Jan 14, 2023, 11:34 AM IST

Child injured by kite string
పతంగుల మాంజా మెడకి చుట్టుకొని చిన్నారికి గాయాలు

Child injured by kite string: సంక్రాంతి పండక్కి గాలిపటం ఎగరవేసి చిన్నారులు అంతా అల్లరి చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతారు. అలాంటి గాలిపటం వలన ఓ చిన్నారికి ప్రమాదం జరిగింది. మేడ్చల్​ జిల్లాలోని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గాలిపటం మాంజా తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి.

Child injured by kite string: సరదాగా ఎగరవేసే గాలిపటం వలన ఓ చిన్నారికి దారుణం జరిగింది. ఆ పాప తన కుటుంబంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో గాలిపటం మాంజా చుట్టకొని తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం 6 సంవత్సరాల కీర్తి తన తల్లిదండ్రులతో కలిసి వనస్థలిపురం నుంచి ఉప్పల్​కి బైక్​పై వెళుతున్నారు. ఈ క్రమంలోనే నాగోల్​ వంతెన సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పిల్లర్​కు గాలిపటం వేలాడుతూ ఉంది.

ఆ గాలిపటం మాంజా వారి ఇరువురికి తగిలింది. దీంతో చిన్నారి తండ్రికి ముక్కుకి గాయం అయింది. చిన్నారి మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే నాగోల్​లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి, అనంతరం చిన్నారిని ఎల్​బి నగర్​లోని రెయిన్​బో ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

"13వ తేదీన సాయంత్రం ఎల్​బీ నగర్​ పై వంతెన మీద బైక్​పై వస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటం ఎవ్వరో ఎగరవేసింది ఆ పై వంతెనపై చిక్కుకొంది. గాలిపటం మాంజా తగిలి పాపకి మెడకి దెబ్బ తగిలింది. పాప తండ్రికి ముక్కుకి గాయాలు అయ్యాయి. సుప్రజ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేర్చాం. తరువాత రెయిన్​బో ఆసుపత్రికి తీసుకొచ్చాం. పాపకి ప్రాణహాని లేదని చెప్పారు. కాకపోతే సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. దయచేసి ఎవరూ గాలిపటాలను రోడ్లపై ఎగరవేయకండి." - బాధితురాలి బంధువు

గాలిపటాలను ఎగరవేసే వారు కొన్నింటిలో జాగ్రత్త వహించండి:

  • రద్దీ ప్రాంతాల్లో.. జనసంచారం ఉన్న చోట ఎగురవేయొద్దు. దారం రోడ్డుకు అడ్డగా పడితే వాహనదారులు ప్రమాదానికి గురయ్యే అవకాశముంది.
  • పతంగి తెగి పడితే పైకి చూస్తూ.. దాని వెంట పరుగెత్తకూడదు.
  • కొందరు పిల్లలు, యువకులు మేడ పైభాగంలో ఆడుతుంటారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కిందపడతారు.
  • కొందరు గ్లాస్‌ కోటింగ్‌తో కూడిన నైలాన్‌, సింథటిక్‌ దారాన్ని వాడుతుంటారు. ఇదీ ప్రమాదకరమే. ఈ దారానికి పక్షులు చిక్కుకొని చనిపోతున్నాయి. వ్యక్తులు గాయపడుతున్నారు.
  • చైనా మాంజాకు బదులు సంప్రదాయ దారం వాడాలని పర్యావరణ వేత్తలు, అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
  • నిర్మానుష్య ప్రదేశాలు, ఆటస్థలాలు, తదితర అనువైన ప్రాంతాల్లో ఎగురవేయండి. ఆనందాన్ని పొందండి.

పై జాగ్రత్తలు పాటించడం వలన పతంగులను ఎగరవేసేటప్పుడు ఎవరికి హాని కలగకుండా ఉంటుంది. గాలిపటాన్ని ఎగరవేయడం వలన మాససిక ఆనందం పొందే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరి మనసు బాధ కలిగించే విధంగా ఉండరాదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details