తెలంగాణ

telangana

Farmers concern in Nalgonda: మద్దతు ధర రాక అన్నదాతల ఆవేదన

By

Published : Apr 17, 2022, 12:16 PM IST

Farmers concern in Nalgonda: ఎండ, వానలకు ఓర్చి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు.. అన్నదాతకు ఆదాయం మాత్రం దక్కడం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా మారి కొర్రీలు పెడుతూ... మద్దతు ధరకు మంగళం పాడుతున్నారు. నల్గొండ జిల్లాలో రైస్‌ మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లతో బారులు తీరిన రైతులకు మిల్లర్ల ధరలు మింగుడుపడక... ఆందోళనలకు దిగుతున్నారు.

Farmers concern in Nalgonda
Farmers concern in Nalgonda

Farmers concern in Nalgonda: నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో వరి ధాన్యం రైతులు మిల్లుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. రైతులు తెచ్చిన ధాన్యానికి రకరకాల కారణాలు చెబుతూ.... మిల్లర్లు అరకొర రేటు కడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మిర్యాలగూడ రైస్ మిల్లులకు ప్రసిద్ధి. నిన్న, మొన్నటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మిల్లర్లు అడిగిన ధరకే ధాన్యాన్ని అమ్మే పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. యాసంగిలో దొడ్డు రకం బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయమని చెప్పడంతో సన్న రకం బియ్యాన్ని పండించడానికే ఎక్కువ మొగ్గు చూపాము.

ప్రభుత్వం 1,960 రూపాయలు మద్దతు ధర ప్రకటించినా... రైతులకు 1800 కూడా రావడం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా మారి నాణ్యత చూడకుండానే ధాన్యానికి ధర కడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం క్రితం క్వింటాకు 2వేల100 వరకూ చెల్లించి... కోతలు పెరిగి ధాన్యం రావడంతో 300 రూపాయలు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1850, 1830 ధరకే కొనుగోలు చేస్తుండటంతో... పెట్టుబడి కూడా రావడం లేదని అన్నదాతలు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

మిల్లర్లను మద్దతు ధర అడిగితే... ధాన్యంలో నల్ల మచ్చ ఉందని, బెరుకులు, తాలు ఎక్కువగా ఉన్నాయని సాకులు చెబుతూ... వడ్లు కొనడం లేదని రైతులు చెబుతున్నారు. నిత్యావసర ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా.... పండించిన పంటకు మాత్రం ధర పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరికీ ఒక్కోలా ధర ఇస్తూ అమాయక రైతులను మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్దతు ధరకు కొనాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మిల్లర్ల దోపిడీని అరికట్టేలా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

మిర్యాలగూడలో మద్దతు ధర రాక అన్నదాతల ఆవేదన

ఇదీ చదవండి:ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బంది కలిగించొద్దు: మంత్రి గంగుల

ABOUT THE AUTHOR

...view details