తెలంగాణ

telangana

వైరస్​ వ్యాప్తిపై నిర్లక్ష్య ధోరణి... మొక్కుబడిగా మాస్కుల ధారణ

By

Published : Apr 21, 2021, 4:55 AM IST

Updated : Apr 21, 2021, 6:58 AM IST

రద్దీ ప్రదేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాపిస్తోంది. అలాంటి ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజలు... అవేవీ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు, బస్టాండుల్లో కొవిడ్‌ నిబంధనలు మచ్చుకైనా కనిపించట్లేదు. జనానికి రవాణా సదుపాయం అత్యవసరమే.... కాని అమలు చేసే క్రమంలో నిబంధనలు పాటించడకపోవడం కేసుల పెరుగుదలకు కారణమవుతోంది.

no masks wearing in mahaboobnagar bus stand
no masks wearing in mahaboobnagar bus stand

వైరస్​ వ్యాప్తిపై నిర్లక్ష్య ధోరణి... మొక్కుబడిగా మాస్కుల ధారణ

జనాలు అధికంగా గుమికూడిన చోట.. వైరస్ వ్యాప్తి ఎక్కువని తెలిసినా... కొందరు మాస్కు మాత్రం ధరించటం లేదు. ముఖానికి మాస్క్‌ ఉన్నా.. వాటిని ముక్కుకు తగిలించుకున్నవాళ్లు చాలా తక్కువ. చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని పాటల్ని ఆస్వాదించడంపై ఉన్న శ్రద్ధ.. మాస్కు ధరించడంపై కనిపించడం లేదు. బస్సుల్లోనూ... జనం మాస్కులు పూర్తిగా ధరించడం లేదు. మాస్కులేని వారిని బస్సు ఎక్కనిచ్చేది లేదని ఆర్టీసీ సిబ్బంది నెత్తినోరు మొత్తుకుంటున్నా.. అప్పటి వరకూ ముఖానికి ఏదో వస్త్రం తగిలించుకుని బస్సెక్కుతున్నారు. ప్రయాణించేటప్పుడు తొలగిస్తున్నారు. ఈ అజాగ్రత్తే జనం కొంపముంచుతోంది. ఇదీ మహబూబ్‌నగర్​లో ప్రస్తుత దుస్థితి.

భౌతికదూరం పాటించడం సంగతి సరేసరి. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసికి తప్పని విధి. విధినిర్వహణలో భాగంగా తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులో నిండుగా ప్రయాణీకులున్న వారిని తీసుకువెళ్తున్నారు. ఐతే మాస్కు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం ద్వారా... వైరస్ వ్యాప్తిని కొంత మేరకు నివారించవచ్చు. కాని ఆ జాగ్రత్తల్ని కుడా జనం పాటించడం లేదు. గతంలో ఆర్టీసీ అధికారులే... సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. కండక్టర్లు వినియోగించడంతోపాటు.. ప్రయాణీకులను చేతులకు రాసే వాళ్లు. కాని ఇప్పుడు ఆర్టీసీ అధికారులు శానిటైజర్లు పంపిణీ చేయకపోవడంతో... సిబ్బంది మాత్రమే వాటిని వాడుతున్నారు.

లాక్‌డౌన్ తర్వాత బస్సుల్ని పునరుద్ధరించినప్పుడు వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఆర్టీసీ అనేక జాగ్రత్తలు తీసుకుంది. బస్సుల్నిశానిటైజ్ చేయడంతోపాటు. సీటు విడిచి సీటులో ప్రయాణీకులు కూర్చునేలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రయాణీకులకు శానిజైటర్ పంపిణీ చేసింది. మాస్కు ధరించిన వారినే బస్సు ఎక్కేలా నిబంధనలు కఠినంగా అమలు చేసింది. ప్రస్తుతం అవేవీ లేకపోవడంతో జనం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మాస్కు ధరించని వారికి, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా ఆర్టీసీ ప్రాంగణాల్లో పకడ్బందీగా అమలు చేస్తే మేలని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.

రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండటం వల్ల రాత్రి 9 లోపు బస్సులన్నీ డిపోలకు చేరేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సుల్లోనూ నిబంధనలు కఠినతరం చేయాలని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: రాత్రి కర్ఫ్యూ పక్కాగా అమలు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

Last Updated : Apr 21, 2021, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details