తెలంగాణ

telangana

పెరుగుతున్న వాయుకాలుష్యం... దుమ్ముధూళితో జనాల సహజీవనం

By

Published : Feb 17, 2021, 4:08 AM IST

Updated : Feb 17, 2021, 6:24 AM IST

మహబూబ్‌నగర్‌లో వాయుకాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. పట్టణంలో ఏడాదిగా సాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో దుమ్ము లేస్తోంది. అన్ని జిల్లాల కంటే పాలమూరులోనే వాయుకాలుష్యం అధికంగా నమోదైందనే పీసీబీ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. జడ్చర్ల- మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి విస్తరణ పనులతో... దుమ్ముధూళివల్ల ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

air pollution increasing in mahaboobnagar
air pollution increasing in mahaboobnagar

పెరుగుతున్న వాయుకాలుష్యం... దుమ్ముధూళితో జనాల సహజీవనం

మహబూబ్‌నగర్ పట్టణంలో రోజురోజుకూ వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనే వాయుకాలుష్యం అధికంగా ఉన్న పట్టణాల్లో... పాలమూరు ముందు వరుసలో ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. గాలిని కలుషితం చేసే.. సూక్ష్మ ధూళి కణాల తీవ్రత నిర్ణీత ప్రమాణాల కంటే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఏడాదిగా జడ్చర్ల- మహబూబ్‌నగర్ జాతీయ రహదారి విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీనివాసకాలనీ నుంచి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణ పనుల కారణంగా గాలిలోకి పెద్దమొత్తం దుమ్ము, ధూళి చేరుతోంది.

ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పోస్తున్న మట్టి, కంకర కారణంగా గాలిలో కాలుష్యం పెరుగుతోంది. దీనికి తోడు రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న భవనాలు, వ్యాపార సముదాయాలను కూల్చేసి శిథిలాలను రోడ్లపైనే వదిలేసి పనులు చేపట్టారు. వాహనాల రాకపోకలతో రోడ్లపై దుమ్మంతా ఇంట్లోకి వచ్చి చేరుతోందని... స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలు, రైస్ మిల్లుల నుంచి వెలువడే పొగ, ధూళి సైతం కాలుష్యానికి కారణమవుతున్నాయని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

రహదారి విస్తరణ పనులు సహా పట్టణంలో భవన నిర్మాణాల్ల వల్లే వాయుకాలుష్యం పెరుగుతోందని ఇంజినీర్లు వెల్లడిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాలుష్యం నమోదు చేసి... పట్టణంలో ఎంత తీవ్రత ఉందనే అంశాన్ని త్వరలో వివరిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:'సల్లంగుండు బిడ్డా... కేసీఆర్'.. సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

Last Updated : Feb 17, 2021, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details