తెలంగాణ

telangana

కాళ్లు పోయాయి... కష్టాలు మిగిలాయి... ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..

By

Published : Jun 1, 2022, 12:14 PM IST

ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలోనే ఆపేసి పెట్రోల్‌ బంక్‌లో చేరాడు. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో సొంతూరుకు తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆ యువకుడి భవిష్యత్తును అంధకారం చేసింది. రెండేళ్లుగా ఆస్పత్రులు తిరుగుతూ ఆపరేషన్లు చేయించినా లేచి నిలబడలేడు. తనకు ఏడు పదులు దాటిన నానమ్మే తనకు అమ్మానాన్న. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, అనారోగ్యంతో బాధపడుతున్న తాను ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు.

Namburi Narsimha Rao
నంబూరి నర్సింహారావు

ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రానికి చెందిన 23ఏళ్ల యువకుడు నంబూరి నర్సింహారావు ఇంటర్‌ పూర్తిచేశాడు. వృత్తి విద్య కోర్సులో చేరాడు. తల్లిదండ్రులు దూరం కావడంతో చదువు మధ్యలోనే నిలిపివేసి ఏపీలోని అన్నవరంలోని ఓ పెట్రోల్‌ బంకులో పనిచేస్తూ నానమ్మకు చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. రెండేళ్ల క్రితం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన బైక్‌ ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో రెండు నెలలపాటు కోమాలోనే ఉన్నాడు.

రెండేళ్లుగా మంచానికే పరిమితం...

ఈ పరిస్థితిలో రెండు కాళ్లు తొలగించాల్సి వస్తుందని వైద్యులు తెలపడంతో హతాశులయ్యారు. బంధువులు, స్నేహితులు తలో చెయ్యి వేసి ఏపీలోని అన్నవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరులలో తొమ్మిదిసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ సమయంలో కాళ్లకు ఎనిమిది రాడ్లు వేశారు. ఒక్క కాలులో ఆరు రాడ్లను అమర్చారు. రూ.పది లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. కనీసం నడవలేదు. రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. వైరాలోని పాత ఇల్లు వర్షాలకు కూలిపోగా ఖాళీ స్థలంలో రేకుల షెడ్డు వేసి నర్సింహారావుకు నానమ్మ కాంతమ్మ సపర్యలు చేస్తోంది. వీల్‌ఛైర్‌, వాకర్‌ వంటివి లేవు. గాయాలు నయం కాక కాళ్లు కదపలేని స్థితిలో ఏడు నెలల క్రితం ఖమ్మం ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో చేరాడు. అక్కడ అందించే ఆహారం తింటూ చికిత్స పొందుతున్నాడు. చదువు కొనసాగించాలని ఉందని, దాతలు ఆదుకోవాలని నర్సింహారావు అర్థిస్తున్నాడు. మరోవైపు వృద్ధాప్యంలో ఉన్న కాంతమ్మ మనవడి భవిష్యత్తును తలచుకొని కన్నీరుమున్నీరవుతోంది. ప్రభుత్వ అధికారులు స్పందించి చేయూత అందించాలని కోరుతోంది. సహాయం చేయదలచినవారు చరవాణి నం.80080 01714లో సంప్రదించగలరు.

ఇవీ చదవండి:‘6 గంటల్లోపు ఆసుపత్రికి వస్తే తెగిన అవయవాలను అతికించొచ్చు’

ABOUT THE AUTHOR

...view details