తెలంగాణ

telangana

Minister Harish Rao : 'రాష్ట్రం కుడి చేయితో ఇస్తే.. కేంద్రం ఎడమ చేత్తో తీసుకుంటోంది'

By

Published : Aug 12, 2021, 2:49 PM IST

" హుజూరాబాద్​ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందని అనుకున్నాం. ఇక్కడికి వచ్చి చూసే వరకు పరిస్థితి అర్థం కాలేదు. నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ 4000 రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేశారు. కానీ ఇక్కడ ఒక్క ఇటుకా కదల్లేదు. ఇప్పటి నుంచి నియోజకవర్గంలో ప్రగతి డబుల్ స్పీడ్​లో పరుగెడుతుంది. ప్రజలంతా కొన్ని పార్టీలు పంచే.. గడియారాలు.. కుంకుమ భరిణెల వంటి ప్రలోభాలకు లొంగకండి. కేసీఆర్ సారథ్యంలో జరిగే అభివృద్ధిని చూసి తెరాసను ఆశీర్వదించండి." - హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

కేంద్రం... కుడి చేయితో ఇచ్చి.. ఎడమ చేత్తో తీసుకుంటోంది
కేంద్రం... కుడి చేయితో ఇచ్చి.. ఎడమ చేత్తో తీసుకుంటోంది

రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

భాజపా ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు(Minister Harish Rao) అన్నారు. ఈ ధరల పెంపుతో రైతులకు సాగు ఖర్చులు పెరిగాయని తెలిపారు. రాష్ట్రం కుడి చేయితో ఇస్తే.. కేంద్రం ఎడమ చేయితో తీసుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా స్త్రీనిధికి, బ్యాంకు లింకేజీకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నామని మంత్రి హరీశ్ అన్నారు. మాజీ మంత్రి ఈటల హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న హరీశ్.. నియోజకవర్గంలో మహిళా సమాఖ్య భవనాలు లేవని తెలిపారు. తన సొంత నియోజకవర్గమైన సిద్దిపేటలో అన్ని గ్రామాల్లో ఈ భవనాలు కట్టించానని చెప్పారు. ఇక్కడ ఎందుకు కాలేదో అర్థం చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

"హుజూరాబాద్​ నియోజకవర్గానికి నిధులు ఇచ్చాం. ఇన్నాళ్లూ ఇక్కడ పనులు జరుగుతున్నాయని అనుకున్నాం. కానీ.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఇప్పుడే తెలిసింది. ఇన్ని రోజులు ఇక్కడ అంతా బాగానే ఉందనుకున్నాం.. కానీ మేం వచ్చాక అర్థమైంది. మరికొన్ని రోజుల్లోగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నాది. రెండు పడక గదుల ఇళ్లకు నిధులు ఇచ్చినా.. నియోజకవర్గంలో ఒక్క ఇటుకా కదల్లేదు. ఇక నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం.. డబుల్ వేగంతో పరిగెడుతుంది. ఆసరా పింఛన్లు, వితంతు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు లబ్ధిదారులకు పక్కాగా అందేలా చర్యలు తీసుకుంటాం.

- హరీశ్ రావు, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి

హుజూరాబాద్​లో మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేశానని హరీశ్(Minister Harish Rao) తెలిపారు. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. 57 ఏళ్లకే వృధాప్యపు పింఛన్లు ఇస్తున్నాం కాబట్టి ..అభయ హస్తం డబ్బు వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పింఛన్ కూడా ఇస్తామని చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు.. కొందరు నేతలు పంచే.. గడియారాలు, కుంకుమ భరిణెల కోసం ఆగం కావొద్దని.. అభివృద్ధిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే మొన్నటి వరకు ఉన్న మంత్రి కల్యాణలక్ష్మి, రైతుబంధు దండగ అంటున్నారని హరీశ్(Minister Harish Rao) అన్నారు. ఎటు వైపు ఉండాలో ఆలోచించుకోండని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మిగతా ప్రాంతాల మాదిరి ఈ నియోజకవర్గంలోనూ మంజూరైన రెండు పడక గదుల ఇళ్లను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రైతులకు 50వేల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత లక్ష కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ప్రతి రంగంలో అభివృద్ధి చేస్తున్న తెరాసకు ప్రజలంతా ఆశీర్వాదం ఇవ్వాలని మంత్రి హరీశ్ కోరారు. ఇంకా రెండున్నర ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్ ఉంటారని.. ఈ ప్రగతి ఇలాగే పరుగులు పెడుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details