తెలంగాణ

telangana

HYD Underground Water: ఉబికివస్తోన్న భూగర్భజలాలు.. ఇంకుడు గుంతలతో మరింత మేలు

By

Published : Aug 5, 2021, 12:03 PM IST

Underground Water increasing in Hyderabad
Underground Water increasing in Hyderabad

ఇటీవలి కురిసిన వానలకు పుడమి పులకించింది. నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. ఒక్క నెలలోనే గరిష్ఠంగా 12 మీటర్ల మేరకు పైకి వచ్చాయి. కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం తక్కువే. ప్రణాళికాబద్ధంగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి పరిధి 7,200 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఈ పరిధిలో ఏటా సగటున కురిసే వర్షపాతం 15 టీఎంసీల నీటితో సమానమని నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా ఏటా నగర అవసరాలకు వాడుతున్న నీటితో సరిసమానం. అయితే ఇందులో 5 శాతం కూడా ఒడిసి పట్టే పరిస్థితి లేదు. కురిసిన వాన అంతా మురుగు కాల్వల ద్వారా మూసీలోకి చేరుతోంది. ప్రణాళికాబద్ధంగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు(ఎడమ నుంచి కుడికి(1-10) ప్రాంతాల పేర్లు దిగువన)

52 శాతం అదనపు వర్షపాతం..

ఈ ఏడాది జూన్‌, జులైలో నగరంలో కురిసిన భారీ వానలతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి బాగా మెరుగుపడింది. నగరంలో భూగర్భ జలాలు వాడకం ఎక్కువ. చాలా అపార్ట్‌మెంట్లలో జలమండలి సరఫరా చేసే నీటితోపాటు 2-4 వరకు బోర్లు వినియోగిస్తున్నారు. పెరుగుతున్న జనాభాతో భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. గత ఏడాది అక్టోబరులో నగరంలో గణనీయంగా వర్షపాతం నమోదైంది. కొన్ని చెరువుల కట్టలు తెగి కాలనీలను ముంచెత్తాయి. తర్వాత పరిస్థితి షరా మామూలే. భూగర్భ జలాలను తోడేయడంతో మళ్లీ ఇంకిపోయాయి. తాజాగా జులైలో నగరంలో కురిసిన వానలకు మళ్లీ పుడమి పులకించింది. వాస్తవానికి మే నుంచి జులై వరకు నగర సగటు వర్షపాతం 260.9 మిల్లీమీటర్లు. అయితే ఈ మూడు నెలల్లోనే దాదాపు 397.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. దాదాపు 52 శాతం అదనపు వర్షపాతం నమోదైనట్లు భూగర్భ జలవనరుల శాఖ నివేదిక వెల్లడిస్తోంది. ఇంకిన బోర్లలో కూడా ఈ వానలతో మళ్లీ నీళ్లు నిండాయి.

1.జువైనల్‌ హోం, సైదాబాద్‌

2.పాలిటెక్నిక్‌ కళాశాల, మాసబ్‌ట్యాంక్‌

3.ఏపీ ట్రైబ్యునల్‌, దారుల్‌షిఫా

4.ఫీవర్‌ ఆసుపత్రి, నల్లకుంట

5.సీఎంఈ ఆవరణ, ఖైరతాబాద్‌

6.ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, వెస్ట్‌మారేడుపల్లి

7.జలమండలి కార్యాలయం, ఎస్‌ఆర్‌నగర్‌

8.మిలిటరీగ్యారేజీ, చాంద్రాయణగుట్ట

9.పెరిగిన భూగర్భ జలాలు

10.ఇందిరాపార్కు, లోయర్‌ట్యాంక్‌బండ్‌

11.చెస్ట్‌ ఆసుపత్రి, ఎర్రగడ్డ

12.గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్‌

మేలు చేసిన ఇంకుడు గుంతలు..

గతంలో చేపట్టిన ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా కొంతవరకు భూగర్భజలాల పెరుగుదలకు ఊతమిచ్చింది. జలమండలి కాలనీ సంఘాల ఆధ్వర్యంలో చాలా ప్రాంతాల్లో తవ్వడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకింది. గత 3-4 ఏళ్లగా వీటిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పలు చోట్ల ఇంకుడు గుంతల్లో పూడిక, చెత్తాచెదారం చేరింది. దీంతో వాన నీళ్లు లోపలకు ఇంకలేని పరిస్థితి నెలకొంది. కాలనీ సంఘాలు చొరవ తీసుకొని వీటికి మరమ్మతులు చేపడితే రానున్న రోజుల్లో కురిసే వానలకు మరింత ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details