తెలంగాణ

telangana

SCHOOL COMMITTEE FIGHTS: పాఠశాల కమిటీ ఎన్నికలు.. రాజకీయ నేతల ఫైటింగులు

By

Published : Sep 22, 2021, 3:24 PM IST

ఏపీలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు రాజకీయ పంచాయతీలకు దారితీశాయి. పాఠశాలలపై పట్టుకోసం రాజకీయ నాయకుల కొట్లాటకు దిగుతున్నారు. కొన్ని జిల్లాల్లో వైకాపా నాయకుల మధ్యే ఘర్షణ నెలకొంది. వారు ఓటు వేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను సైతం అడ్డుకుంటున్నారు. ఘర్షణల కారణంగా అధికారులు.. కొన్నిచోట్ల ఎన్నికను వాయిదా వేస్తున్నారు.

SCHOOL COMMITTEE FIGHTS
పాఠశాల కమిటీ ఎన్నికలు.

ఏపీలోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని వెల్లంపల్లిలో ఘర్షణ తలెత్తింది. పాఠశాలలో కమిటీ ఎన్నిక ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. పలువురికి గాయాలయ్యాయి.ఈ ఘటనతో గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

SCHOOL COMMITTEE FIGHTS

తూర్పు గోదావరి జిల్లాలో..

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలిలో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని వైకాపా శ్రేణులు డిమాండ్‌ చేశాయి. తెదేపా శ్రేణులు మాత్రం ఎన్నికలు జరిపించాలని పట్టుబట్టాయి. అధికార పార్టీ నాయకులు ఓ అడుగు ముందుకేసి ఓట్ల కోసం వెళుతున్న తల్లిదండ్రులను అడ్డుకున్నారు. అడ్డు తొలగాలంటూ గ్రామస్థులతో కలిసి తెదేపా శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని చెదరగొడుతున్నారు.

పాఠశాల కమిటీ ఎన్నికలు.

కడప జిల్లాలో ..
కడప జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువులో పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలో ఘర్షణ తలెత్తింది. వైకాపాలో రెండు వర్గాల మధ్య ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు పోటాపోటీ నెలకొంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

ఒక్క ఓటు విషయంలో వాగ్వాదం..

జిల్లాలోని పెద్దచెప్పలిలోని పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలో ఒక్క ఓటు విషయంలో వైకాపా, తెదేపా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. అధికారులు ఎన్నికను వాయిదా వేశారు.

అనంతపురం జిల్లాలో..

అనంతపురం జిల్లా శింగనమల మండలం ఇరువెందులలో పాఠశాల కమిటీలను ఎన్నుకునే విషయంలో ఘర్షణ తలెత్తింది. ఘర్షణలో ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా వేశారు.

ఇదీ చదవండి:rain in Hyderabad: భాగ్యనగరంలో ఎడతెరిపిలేని వర్షం..

ABOUT THE AUTHOR

...view details