తెలంగాణ

telangana

Revanth Comments: ప్రజలను దోచుకోవడంలో కేసీఆర్, మోదీ ఇద్దరూ ఇద్దరే

By

Published : Nov 7, 2021, 10:15 PM IST

Updated : Nov 8, 2021, 2:23 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ మీడియా సమావేశంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇన్నిరోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్ ఇప్పుడు.. మోదీపైన, భాజపాపైన యుద్ధం అంటూ మరో నాటకానికి తెర లేపారన్నారు. కేసీఆర్, మోదీ నాటకాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని రేవంత్​ తెలిపారు.

tpcc chief revanth reddy comments on cm kcr press meet
tpcc chief revanth reddy comments on cm kcr press meet

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు కలిసే తెలంగాణ రైతులకు ఉరి తాళ్లు సిద్ధం చేస్తున్నారన్న విషయం సీఎం మీడియా సమావేశంలోని మాటలు స్పష్టం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనాల్సిందిగా కోరబోమని ఆయనే స్వయంగా కేంద్రానికి లేఖ ఇచ్చినట్టు కేసీఆర్ బహిరంగంగా ఒప్పుకున్నారన్నారు. తెలంగాణ రైతుల పక్షాన ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతు సంఘాలు, రైతు నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా కేంద్రానికి లేఖ ఏ కారణంతో ఇచ్చారని నిలదీశారు.

కేసుల విషయంలో కేసీఆర్​కు ప్రధాన మంత్రి మోదీ సహకారం అవసరమని రేవంత్​రెడ్డి ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగానే రైతుల ప్రయోజనాలకు ఉరివేసే లేఖను ఇచ్చారని ఆరోపించారు. బాయిల్డ్ రైస్ తీసుకోమని అడగబోమని కేంద్రానికి లేఖ ఇచ్చి ఇప్పుడు పోరాటం చేస్తానని చెప్పడం తెలంగాణ రైతులను మోసం చేయడం కాదా అని నిలదీశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఏడాదిగా రైతులు కొట్లాడుతుంటే.. మోదీతో ములాఖత్‌, తెరాస పార్టీ ఆఫీసు శంకుస్థాపనలకు పదే పదే దిల్లీకి వెళ్లిన కేసీఆర్​కు వాళ్లను పరామర్శించాలన్న ఆలోచన కలగలేదా అని రేవంత్​ ప్రశ్నించారు.

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ మీడియా సమావేశం పెడితే.. రైతుల సమస్యలకు పరిష్కారం చూపిస్తారని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచుతారని, కామారెడ్డి జిల్లాలో వరికుప్పపై రైతు బీరయ్య మృతిచెందడంపై స్పందిస్తారని ఆశించామన్న రేవంత్‌ రెడ్డి.. వాటి ఊసే ఎత్తలేదంటూ మండిపడ్డారు. కొనుగోలు కేంద్రంలో వరి కుప్పపై గుండె పగిలి రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఒక్క తెరాస ఎమ్మెల్యేగానీ.. మంత్రి కానీ, కనీసం జిల్లా కలెక్టర్ కూడా పరామర్శించలేదని ధ్వజమెత్తారు.

పంట కోతలకు సైతం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని.. ధాన్యం సేకరణపై స్పష్టమైన విధి విధానాలపై మాట్లాడతారని ఎదురు చూశామని కానీ అవేవీ చేయకుండా కేంద్రంతో కయ్యం అంటూ మళ్లీ పాతపాటే పాడారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం తానేమీ చేయలేనని చేతులెత్తేశారని ఆరోపించారు.

మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్​పై ఉన్న శ్రద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కేసీఆర్‌కు ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పెట్రోలియం ఉత్పత్తులపై రాష్ట్రం ఒక్క రూపాయి పెంచలేదని కేసీఆర్‌ చెప్పడం పచ్చి అబద్ధమని రేవంత్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపితే తప్ప తమ సమస్యలు పరిష్కారం కావని రైతులు భావిస్తున్నారని రేవంత్​ చెప్పారు. వాళ్ల పక్షాన నిలబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజాకోర్టులో తేల్చేందుకు కాంగ్రెస్ కార్యాచరణతో ముందుకు వెళ్తుందని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

రైతులకు మరణ శాసనం రాశారుు..

"ప్రజలను మోసం చేయడంలో భాజపా, తెరాస ఒక్కటే. కేసీఆర్, మోదీ కలిసి రైతులను మోసం చేస్తున్నారు. అటు వరి వేయమని కేంద్రానికి రాసిచ్చి.. ఇటు వరి వేస్తే ఉరే అని తెలంగాణ రైతులకు కేసీఆర్​ మరణశాసనం రాశారు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.కేసీఆర్, మోదీ కలిసి రైతులను మోసం చేస్తున్నారు.రాయచూరు ప్రజలు తెలంగాణ మమ్మల్ని కలపాలని అంటున్నారని కేసీఆర్ గొప్పలు పోతున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలుపుతారు. పంజాబ్‌ సహా 24 రాష్ట్రాల్లో చమురుపై వ్యాట్ తగ్గింది. మరి.. రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ ఎందుకు తగ్గించట్లేదు..? ప్రజలను దోచుకోవడంలో, అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్, మోదీ ఇద్దరు ఇద్దరే. ఇన్నిరోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్.. ఇప్పుడు మోదీపైన, భాజపాపైన యుద్ధం అంటూ మరోసారి నటిస్తున్నారు. కేసీఆర్, మోదీ దొంగ నాటకాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు." - రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:

Last Updated :Nov 8, 2021, 2:23 AM IST

ABOUT THE AUTHOR

...view details