తెలంగాణ

telangana

Corona : ఆ రెండు ఒకేసారి వస్తే.. ముప్పు తప్పదు

By

Published : Jul 3, 2021, 7:20 AM IST

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. మరోవైపు సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమైంది. వర్షాలు కురుస్తున్నందున డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే అవకాశాలున్నాయి. ఈసమయంలో కొవిడ్, సీజనల్ వ్యాధులు ఏకకాలంలో ప్రబలితే.. ఆరోగ్యం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కరోనా బాధితులకు డెంగీ సోకితే.. ముప్పు మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Corona, Dengue, Covid, Seasonal Diseases, Dengue to Corona Patient
కరోనా, డెంగీ, కొవిడ్, సీజనల్ వ్యాధులు, కరోనా రోగికి డెంగీ

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో సీజనల్‌ వ్యాధుల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే రోజుకు 1,000కి పైగానే కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవుతుండగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ సుమారు 250 డెంగీ కేసులు నిర్ధారణ అయ్యాయి. వర్షాలు కురుస్తున్న సందర్భాల్లో డెంగీ, మలేరియా, గన్యా తదితర దోమకాటు వ్యాధులు విజృంభించే అవకాశాలున్నాయి. ప్రజలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరం పాటించడం లాంటివి విస్మరిస్తే.. కరోనా తిరిగి విరుచుకుపడవచ్చు.

ఏకకాలంలో కొవిడ్‌, దోమకాటు వ్యాధులు ప్రబలితే.. ప్రజారోగ్యం అతలాకుతలమయ్యే ప్రమాదముంది. ముఖ్యంగా కొవిడ్‌ బాధితులకు డెంగీ సోకితే ముప్పు తీవ్రత మరింత పెరిగే అవకాశాలుంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి విషమించి ఎక్కువ కాలం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వస్తుందని, ఆర్థికంగానూ చితికిపోయే ప్రమాదముందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఒకవైపు కరోనా కట్టడి చర్యలను అమలు చేస్తూనే.. డెంగీ, మలేరియా, గన్యాలను నియంత్రించడంపై దృష్టి సారించింది. సత్వర కార్యాచరణ చేపట్టాలంటూ తాజాగా అన్ని జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

చికిత్సలో వైరుధ్యాలు

  • సాధారణంగా డెంగీ బాధితులకు ఐవీ ద్రావణాలను ఇవ్వాల్సి ఉంటుంది. కొవిడ్‌ రోగులకు వాటిని ఇస్తే తొలి దశలోనే శ్వాసకోశ వ్యాధి (అక్యూట్‌ రెస్పిరేటరీ డిసీజ్‌ సిండ్రోమ్‌), ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు రావొచ్చు. ఐవీ ద్రావణాలను ఎక్కించేటప్పుడు అవసరమైన కొన్ని రక్త పరీక్షలను చేయించాల్సి ఉంటుంది.
  • కొవిడ్‌ బాధితులకు రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి ‘హెపరిన్‌’ ఔషధాన్ని ఇస్తుంటారు. డెంగీ రోగులకు దీన్ని ఇస్తే.. ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్న వారిలో రక్తస్రావం పెరిగే అవకాశాలెక్కువగా ఉంటాయి.
  • డెంగీలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయి రక్తనాళాల నుంచి ప్లాస్మా వెలుపలికి వస్తుంది. కొవిడ్‌లో రక్తం గడ్డకట్టి రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది.

రెండింటికీ సారూప్యత

  • కొవిడ్‌, డెంగీ జ్వరాల లక్షణాలు ఒకేలా ఉండడం వల్ల జబ్బును గుర్తించడంలో పొరబడే, జాప్యం జరిగే అవకాశాలూ ఎక్కువ.
  • రెండింటిలోనూ సుమారు 80 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.
  • సమస్య తీవ్రమైతే ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించాల్సి వస్తుంది.
  • త్వరితగతిన గుర్తించి, వేగంగా చికిత్స అందించడమే ముఖ్యం.
  • రెండింటికీ కచ్చితమైన నిర్దేశిత చికిత్స లేదు.

మార్గదర్శకాల జారీ

కొవిడ్‌ నేపథ్యంలో దోమకాటు వ్యాధుల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యాధుల నివారణతో పాటు నియంత్రణ వ్యూహాలనూ రూపొందించింది. అన్ని జిల్లాల వైద్యాధికారులకు మార్గదర్శకాలను పంపించింది. ప్రతి జిల్లాలోనూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, స్వల్పంగా ఉన్న ప్రాంతాలు, అసలు కరోనా కేసులు నమోదు కాని ప్రాంతాలు.. ఇలా మూడు రకాలుగా విభజించుకోవాలి. దోమల నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతూనే కొవిడ్‌ జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమల నిర్మూలన చర్యలపై అవగాహన పెంపొందించాలి. కొవిడ్‌ కంటెయిన్‌మెంట్‌ కేంద్రాల పరిధిలోని వాటితో పాటు అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన ఔషధాలను సమకూర్చుకోవాలి. డెంగీ, మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ తిరుగుతూ జ్వర నిర్ధారణ చేసేందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలి. జ్వర నిర్ధారణ సమాచారాన్ని ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. డెంగీ, కొవిడ్‌ రెండూ ఉన్న వ్యక్తులను గుర్తిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోని వైద్యునికి సమాచారమివ్వాలి.

ABOUT THE AUTHOR

...view details