తెలంగాణ

telangana

మే 17 నుంచి పది పరీక్షలు.. ఈసారికి ఆరే!

By

Published : Jan 24, 2021, 7:16 AM IST

తొమ్మిది, పదో తరగతులకు విద్యా సంవత్సరాన్ని విద్యా శాఖ ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిది, పదో తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. పదో తరగతి వార్షిక పరీక్ష మే 17 నుంచి జరగనున్నాయి. పాఠశాలలకు హాజరు తప్పనిసరి కాదని.. ప్రత్యక్ష బోధనకు హాజరు కావాలా.. ఆన్ లైన్ తరగతులకు హాజరు కావాలా అనేది తల్లిదండ్రుల ఇష్టమని స్పష్టం చేసింది.

telangana ssc
telangana ssc

పదో తరగతి వార్షిక పరీక్షలు మే 17 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 9, 10 తరగతులకు ప్రభుత్వం శనివారం విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రధాన పరీక్షలు ఆరు రోజులు, ఓరియంటల్‌ విద్యార్థులకు మూడు రోజులపాటు జరుగుతాయి. అంటే ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాశాఖ మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. నాలుగు అంతర్గత పరీక్షలకు (ఎఫ్‌ఏ) బదులు ఈసారి రెండే ఉంటాయి. సెప్టెంబరు 1 నుంచి జరుగుతున్న ఆన్‌లైన్‌ పాఠాలు 115 రోజులు.. ఫిబ్రవరి 1 నుంచి మే 26 వరకు (పరీక్ష తేదీలను కలుపుకొని) 89 రోజుల ప్రత్యక్ష బోధన.. మొత్తం 204 పనిదినాలుగా చూపారు.

పునఃప్రారంభం జూన్‌ 14న

మే 26 చివరి పనిదినం. 27వ తేదీ నుంచి జూన్‌ 13 వరకు.. 18 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. జూన్‌ 14న పాఠశాలల పునఃప్రారంభం కావలసి ఉంది. ప్రతిసారి పునఃప్రారంభం తేదీని ఇచ్చేవారు. అయితే ఆ విషయాన్ని మాత్రం విద్యా క్యాలెండర్‌లో ప్రస్తావించలేదు. ఈసారి వేసవి సెలవులు దాదాపు 30 రోజులు తగ్గాయి.

తరగతి గదుల్లోనే యోగా

పిల్లలు ఉల్లాసంగా ఉండేందుకు, మానసిక ఆందోళనను తగ్గించేందుకు చిన్న చిన్న యోగాసనాలను వేయించాలని, భౌతిక దూరం పాటిస్తూ తరగతి గదుల్లోనే సాధన చేయించాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యేతర కార్యక్రమాల కింద నాట్యం, సంగీతం, పద అంత్యక్షరి, గణితం ఆటల్లాంటి వాటిని అవసరం మేరకు ఆయా పాఠాలకు అనుబంధంగా ఉండే వాటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

30% సిలబస్‌ ఎఫ్‌ఏలకూ ఉండదు

70 శాతం సిలబస్‌ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 30 శాతం సిలబస్‌ కేవలం అసెన్‌మెంట్లు, ప్రాజెక్టులకు కేటాయిస్తారు. వాటిని ఇంటిలో చేయాలి. ఈ సిలబస్‌ అంతర్గత పరీక్షలకూ (ఎఫ్‌ఏ) ఉండదు. 9, 10 తరగతులకు ఏప్రిల్‌ నెలాఖరుకు సిలబస్‌ పూర్తి చేస్తారు. మేలో పునశ్చరణ తరగతులు జరుపుతారు.

హాజరు తప్పనిసరి కాదు..

  • ఫిబ్రవరిలో 24, మార్చిలో 25, ఏప్రిల్‌లో 21, మే నెలలో 19 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి.
  • విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదు. తల్లిదండ్రుల అనుమతితోనే బడులకు రావాలి. ఇంటి దగ్గర నుంచైనా ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు.
  • క్రమం తప్పకుండా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయాలి. కరోనా లక్షణాలను గుర్తిస్తే ప్రత్యేక వాహనంలో తోడు ఇచ్చి ఇంటికి పంపిస్తారు.
  • ఉదయం 10-11 గంటల వరకు 2 పిరియడ్లు పదో తరగతికి, సాయంత్రం 4 - 5 గంటల వరకు ప్రతిరోజూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రసారం ఉంటాయి.

సైన్స్‌లో రెండు ప్రశ్నపత్రాలు

పదో తరగతిలో ఈసారి సైన్స్‌ సబ్జెక్టుకు ఒక్కటే పరీక్ష అయినా వేర్వేరుగా రెండు ప్రశ్నపత్రాలు, రెండు ఓఎంఆర్‌ పత్రాలు ఇవ్వనున్నారు. సైన్స్‌లో భౌతికశాస్త్రం, జీవశాస్త్రం సబ్జెక్టులు ఉండడమే కారణం. ఒక్కో దానికి 40 మార్కులు చొప్పున 80 మార్కులకు రాత పరీక్ష. మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే అంతర్గత పరీక్షలకు 20 మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రాలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, రాయడానికి పేపర్లు కూడా విడివిడిగా ఇస్తారు. మూల్యాంకన సమయంలో సులభతరంగా ఉంటుందని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పరీక్ష సమయం 2.45 గంటలు కాగా దాన్ని 3 గంటలకు పెంచనుంది. వివరణాత్మక ప్రశ్నల్లో ‘ఎ’ లేదా ‘బి’ ప్రశ్నకు సమాధానం రాయాలని అడిగేవారు. ఈసారి అందుకు భిన్నంగా ఎ, బి, సి, డి.. ఇలా ఇచ్చి రెండు రాసే విధానాన్ని అమలు చేస్తారు. దానివల్ల విద్యార్థులకు మరింత ఛాయిస్‌ పెంచినట్లవుతుందన్నది విద్యాశాఖ ఆలోచన.

ముందు చిన్న పరీక్షలు!

మే 19వ తేదీ వరకు ఇంటర్‌ ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. అవి పూర్తికాకుండానే మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలైతే పరీక్ష కేంద్రాలు, ఆరోగ్య, పోలీసు సిబ్బంది కొరత లాంటి సమస్యలు వస్తాయని పరీక్షల విభాగం భావిస్తోంది. టెన్త్‌లో ఓరియంటల్‌, ఒకేషనల్‌కు మూడు పరీక్షలు జరపాల్సి ఉంటుంది. వాటికి తక్కువ పరీక్ష కేంద్రాలే అవసరమవుతాయి కాబట్టి వాటిని ముందుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంటే మే 17, 18, 19 తేదీల్లో ఆ పరీక్షలు పూర్తయితే.. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే పరీక్షల విభాగం ఏ రోజు ఏ పరీక్ష అన్న దానిపై కాలపట్టిక విడుదల చేయనుంది.

ఇదీ కాలపట్టిక

  • పాఠశాల సమయం: ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4.45 గంటలు (హైదరాబాద్‌లో ఉదయం 8.45 నుంచి 4 గంటల వరకు)
  • బడులు ప్రారంభం: ఫిబ్రవరి 1
  • ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-1): మార్చి 15 లోపు (34 పనిదినాలు)
  • ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ-2): ఏప్రిల్‌ 15 వరకు (మొత్తం 56 పనిదినాలు)
  • సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (చివరి పరీక్షలు): మే 7 నుంచి 13 వరకు
  • 9వ తరగతికి ఫలితాల వెల్లడి, తల్లిదండ్రుల సమావేశం: మే 26
  • పది వార్షిక పరీక్షలు: మే 17 నుంచి 26 వరకు

ఇదీ చదవండి :అందని 'ఉపకారం'... కాలేజీకి వెళ్లాలంటే కష్టాలనేకం!

ABOUT THE AUTHOR

...view details