తెలంగాణ

telangana

నేటి నుంచి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

By

Published : Sep 16, 2022, 9:02 AM IST

Telangana Liberation Day
తెలంగాణ విమోచన దినోత్సవం ()

Telangana Liberation Day: ( ) తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చిన తెలంగాణ.... 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిపాటు వైభవంగా వేడుకలు నిర్వహిస్తోంది.

Telangana Liberation Day: తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యవ్యవస్థలోకి వచ్చి రేపటితో 74 ఏళ్లు పూర్తవుతోంది. 75వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరిట ఏడాదిపాటు ఘనంగా వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వజ్రోత్సవ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలను ఇందులో భాగస్వామ్యం చేస్తారు. తెలంగాణ చరిత్రలో ఎంతో చారిత్రకతను సొంతం చేసుకున్న సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ జెండా ఎగరవేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. రేపు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని సెంట్రల్ లాన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి ప్రసంగిస్తారు.

రేపు మధ్యాహ్నం హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను సీఎం జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజా నుంచి ఎన్​టీఆర్​ స్టేడియం వరకు గిరిజన కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం స్టేడియంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ప్రారంభ వేడుకల్లో మూడో రోజైన ఈనెల 18న జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్ర సమరయోధులను సన్మానిస్తారు. కవులు, కళాకారులను గుర్తించి సత్కరిస్తారు. అనంతరం వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 16,17,18న మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details