తెలంగాణ

telangana

రాష్ట్రాల వివాదాల విషయంలో కేంద్రానికి పెద్దన్న పాత్రే...

By

Published : Feb 16, 2021, 4:10 AM IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కేంద్రం కేవలం పెద్దన్న పాత్ర మాత్రమే పోషించగలదని హైకోర్టు స్పష్టం చేసింది. టేబుల్‌కు ఇరుపక్కల రాష్ట్రాలను కూర్చోబెట్టి చర్చించడం మాత్రమే చేయగలదని... వాటిని శాసించే ప్రత్యేకాధికారం లేదంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రానికి అధికారం కట్టబెట్టే ఎలాంటి నిబంధన లేదని... అందువల్ల ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే విభజన వివాదాల్లో కేంద్రానికి ఉన్న అధికారం పరమితమేనంది. న్యాయపరమైన వివాదాలను తేల్చాల్సింది న్యాయస్థానాలేనని... కేంద్రం కాదని పేర్కొంది.

Telangana high court on ap dairy bifurcation
Telangana high court on ap dairy bifurcation

రాష్ట్రంలో లాలాపేటలోని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2016 మే 6న జారీ చేసిన జీవో 8ను సవాలు చేస్తూ కార్పొరేషన్‌ ఎండీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రారావు, జస్టిస్‌ టీ.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరపున ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థల ఆస్తులు రెండింటికీ చెందుతాయని పేర్కొన్నారు. తెలంగాణ పరిధిలో ఉన్నంత మాత్రాన దానికే పరిమితం కాదనన్నారు.

సేవల ఆధారంగానే ...

పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సంస్థ అందిస్తున్న సేవల ఆధారంగా విభజన జరగాలని... అంతేగాని అది ఉన్న ప్రాంతం ఆధారంగా కాదన్నారు. ఇందులో ప్రధానకార్యాలయం నిర్వచనాన్ని పరిశీలించాలని... కేవలం కార్యాలయం దాని అతిధి గృహం మాత్రమే కాదన్నారు. రెండు రాష్ట్రాలకు సేవలందిస్తున్న ఫ్యాక్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. 9 షెడ్యూలులోని ఆస్తుల పంపకం జరగకపోయినా లాలాపేటలోని పరిశ్రమను రాష్ట్రానికి వర్తింపజేసుకుంటూ జీవో జారీ చేసిందన్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పాలు వస్తాయన్నారు.

కేంద్రం జోక్యం చేసుకోవాలి...

తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ బీ.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ... రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా డెయిరీ విభజన తాత్కాలికంగానే జరిగిందన్నారు. ప్రధాన కార్యాలయంలో రెండస్తులు ఏపీకి, రెండంతస్తులు తెలంగాణకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. లాలాపేటలో ఉన్నది ప్రధాన కార్యాలయం కాదని, తెలంగాణకు మాత్రమే వర్తిస్తుందని... ఏపీలోని కేంద్రాల్లో తెలంగాణ హక్కులు కోరడం లేదన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 47(4), 66, 71ల ప్రకారం కేంద్రానికి అధికారం ఉందనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ సెక్షన్‌లు ఆస్తుల పంపకానికి చెందిన అంశాలని... అంతేగానీ 9, 10వ షెడ్యూలులో ఉన్నవాటి పంపకానికి వర్తించవని పేర్కొంది.

శాసించే అధికారం కేంద్రానికి లేదు...

రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తినపుడు పరిష్కరించే అధికారాన్ని కట్టబెడుతూ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో నిబంధన ఎక్కడాలేదని పేర్కొంది. ప్రాథమికంగా రెండు రాష్ట్రాల వివాదాల్లో శాసించే అధికారం కేంద్రానికి లేదన్నారు. రాష్ట్రాల మధ్య, కేంద్రం- రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తితే న్యాయపరంగా తేల్చే అధికారం సుప్రీం కోర్టుకు ఉందని పేర్కొంది. న్యాయపరమైన అంశాలు తేల్చే అధికారాన్ని రాజ్యాంగం చట్ట సంస్థలకు కేటాయించలేదని... కోర్టులకే ఉందని పేర్కొంది. క్వాసీ జ్యుడీషియల్ అధికారాలున్న ఆదాయపు పన్ను శాఖ, పారిశ్రామిక వివాదాలు వంటి కొన్నింటిలో కమిటీ ఉంటుందని అలాంటి వాటిలో మాత్రమే న్యాయపరమైన అంశాలను అది తేలుస్తుందన్నారు.

కేంద్రంపై అసహనం...

కేంద్రానికి పూర్తి అధికారాలున్న అంశాలనే తేల్చడంలేదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. హోంశాఖలో ఉద్యోగుల సీనియారిటీకి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి ఈ కోర్టు ఆదేశించినా ఫలితంలేదంది. చట్టంలో కేంద్రానికి నిర్ధుష్టమైన అధికారాలున్న చోట కూడా నిష్రియాపరత్వం ప్రదర్శిస్తోందన్నారు. ఈ వివాదంలో కేంద్రం ఇప్పటివరకు కౌంటరు కూడా దాఖలు చేయకపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చంది.

కౌంటరులోనే భిన్నాభిప్రాయాలు

డెయిరీ విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటరులోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. విభజన నిమిత్తం జీవో 8ను జారీ చేశారని అనంతరం జీవో 17ను జారీ చేసిందన్నారు. ఈ రెండు జీవోలకు పొంతన కుదరడంలేదంది. తాత్కాలిక ఏర్పాట్లలో భాగంగా జీవో 8 జారీ చేశామని... ఇప్పుడు దాన్ని చెత్తబుట్టలో వేశామని దానికి అర్థం లేదంటే ఎలా అని ప్రశ్నించింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది అటెండరు కాదని... ముఖ్యశాఖకార్యదర్శి అన్నది పరిగణనలోకి తీసుకోవాలంది. ఓ వైపు శాశ్వత కేటాయింపు అంటూ మరో వైపు తాత్కాలికమంటున్నారంది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.

ఇదీ చూడండి :వెంచర్ కోసం డబ్బులిచ్చారు... మోసపోయామని ట్యాంక్ ఎక్కారు..

ABOUT THE AUTHOR

...view details