తెలంగాణ

telangana

Telangana Tourism: పర్యాటక రంగానికి పూర్వవైభవం తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు

By

Published : Aug 18, 2021, 4:22 AM IST

Telangana government exercise for development Tourism
Telangana government exercise for development Tourism

కరోనాతో దెబ్బతిన్న పర్యాటకరంగాన్ని పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కొత్త ప్యాకేజీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు ఇతర చర్యలు తీసుకుంటోంది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం సర్క్యూట్ కోసం ఆసక్తి వ్యక్తీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

కొవిడ్ ప్రభావం పర్యాటక రంగంపై తీవ్రంగా పడింది. కరోనా, లాక్​డౌన్​తో పర్యాటక ప్రాంతాలన్నీ కళ కోల్పోయాయి. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక కరవైంది. రెండో వేవ్ ప్రభావం తగ్గడంతో అన్ని రంగాలతో పాటే పర్యాటక రంగ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. పర్యాటకం నెమ్మదిగా పుంజుకుంటోంది. అంతర్జాతీయ పర్యాటకులు లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. కొవిడ్ నిబంధనలకు లోబడి పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కాకతీయుల శిల్పా కళా వైభవానికి ప్రతీకగా నిలిచే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ఇటీవల గుర్తించింది. ఈ పరిణామాన్ని బాగా ఉపయోగించుకునేందుకు పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్దమవుతోంది.

ప్రపంచస్థాయి ప్రమాణాలతో...

పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్త ప్యాకేజీలను అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించేందుకు వీలుగా భిన్న ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నారు. కొంత మంది సమూహంగా వెళ్లాలనుకుంటే వారి ఇండ్ల వద్దకే పర్యాటక శాఖ బస్సులు పంపేందుకు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సిద్దమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న జలాశయాలు, ఆ ప్రాంతంలో ఉన్న ఆలయాలు, ప్రదేశాలను కలుపుతూ కాళేశ్వరం సర్క్యూట్​ను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్​లో 750 కోట్ల రూపాయలు కేటాయించారు. అందుకు అనుగుణంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో పర్యాటక ప్రాజెక్ట్ చేపట్టేందుకు సర్కార్ సిద్దమైంది. ప్రణాళికల తయారీ కోసం పర్యాటకాభివృద్ది సంస్థ ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. వివిధ ప్రతిపాదనలను పరిశీలించి సర్క్యూట్ ప్రాజెక్టుకు ఆమోదముద్ర వేయనున్నారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం మధ్య... శ్రీశైలం, సోమశిల మధ్య బోటింగ్​ను వీలైనంత త్వరలో ప్రారభించేందుకు పర్యాటకాభివృద్ధి సంస్థ సిద్దమవుతోంది. తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం అమలు చేస్తున్న ప్యాకేజీలకు మంచి స్పందన ఉందని అధికారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి:

ktr: 'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'

ABOUT THE AUTHOR

...view details