తెలంగాణ

telangana

CHEF TECHIE: లక్షల్లో జీతం వదిలి.. అభి'రుచి' వైపు అడుగులు వేసి

By

Published : Jan 17, 2022, 9:09 AM IST

Chacos Express Academy: లక్షల రూపాయల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం. వారానికి రెండ్రోజులు సెలవులు. భవిష్యత్తు భరోసాతో జీవితం సాఫీగా సాగుతోంది. అయినా ఏదో వెలితి. ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి చేయాలనుకున్న ఓ పని మనసులో అదేపనిగా మెదులుతోంది. ఇబ్బందులను అధిగమించి ఎలాగోలా అనుకున్న దానిలో తర్ఫీదు పొంది.. వృత్తిని, ప్రవృత్తినీ సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ఇంతలో మనసులో మళ్లీ ఇంకో కోరిక. నేర్చుకున్న విద్యకు సార్థకత ఉండాలి కదా అని. అభ్యంతరాలు, అవాంతరాల మధ్యే అదీ సాధించారు. ఓ సంస్థను స్థాపించి.. తనతో పాటు మరెంతో మందికీ ఉపాధి మార్గం చూపారు.

Chacos Express Academy
అభి'రుచి' వైపు అడుగులు వేసి.. విజయం సాధించి

అభి'రుచి' వైపు అడుగులు వేసి.. విజయం సాధించి

Chacos Express Academy: ఉషా పోలు.. స్వస్థలం ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ. ఎంసీఏ చదివారు. చదువు పూర్తయిన వెంటనే 2010లో మంచి ప్యాకేజీతో సాప్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చింది. 2016 నుంచి హైదరాబాద్‌లోని పలు సంస్థల్లో ఉద్యోగం చేశారు. భర్త ఆదికేశవ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి బాబు పుట్టాడు. చిన్నప్పటి నుంచే కేకులు తయారు చేయాలనుకునే కోరికతో ఉన్న ఉషా.. బాబుకి నెల రోజులు వచ్చాక.. ఫాండెడ్‌ కేకు చేయాలని అనుకున్నారు. తయారీ గురించిన అవగాహన తెలీదు. సామాజిక మాధ్యమాల్లో చూసి.. ఎలాగోలా కేకు చేశారు. అది అనుకున్నంత బాగా రాకపోవడంతో.. తయారీ నేర్చుకోవాలని సంకల్పించారు. తెలుగురాష్ట్రాల్లో ఎవరూ లేకపోవడంతో.. ముంబయి, బెంగళారు లాంటి నగరాలకు వెళ్లి లక్షలు వెచ్చించి మరీ నేర్చుకున్నారు. ఉద్యోగం, అభిరుచి , రెండింటి మధ్య సమతూకం ఉండేలా చూసుకున్నారు. అలా కేకులు, చాక్లెట్లు, కుకీస్‌.. ఎన్నో నేర్చుకున్నారు. ఆర్డర్లపై సరఫరా చేయడం ప్రారంభించారు.

వృత్తి, ప్రవృత్తి మధ్య సమన్వయం కుదరక..

ఇలా అభిరుచి ప్రయాణం సాగుతుండగా.. ఓ రోజు భర్తని కోల్పోయిన ఓ మహిళ.. తనకూ నేర్పిస్తే ఆసరాగా ఉంటుందని కోరగా.. ఆమెకు నేర్పించారు. ఆ తర్వాత సంఖ్య పెరిగింది. ఇలా నాలుగేళ్లు గడిచాయి. వృత్తి, ప్రవృత్తి మధ్య సమన్వయం కుదర్లేదు. ఉద్యోగానికి స్వస్తి పలికి.. విజయవాడ వచ్చేశారు. ఈ సమయంలోనే ఇంత మందికి నేర్పిన తాను.. చెఫ్‌ అయితే బాగుండు అనుకున్నారు. అందుకు సర్టిఫికేషన్‌ కావాల్సి ఉండటంతో.. ఓ సంస్థను సంప్రదించినా.. వివిధ రకాల అభ్యంతరాలతో ముందడుగు పడలేదు. వేరే నగరంలో సర్టిఫికేషన్‌ పూర్తిచేశారు. తర్వాత చాకోస్‌ ఎక్స్‌ప్రెస్‌ అకాడమీ అనే ఇనిస్టిట్యూట్‌ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా సంస్థ ఇదే మొదటిది.

ఇంట్లో ఉంటూనే ఆదాయం గడిస్తున్నామని ఉషా దగ్గర శిక్షణ తీసుకున్న మహిళలు చెబుతున్నారు. సర్టిఫికేషన్‌ కోసం గతంలో తనను వద్దన్న వాళ్లే.. ఇప్పుడు తమ వద్దకొచ్చే వారికి శిక్షణ ఇవ్వాలని కోరుతున్నారని.. ఇదే తనకు గొప్ప విజయమని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు ఉష. భవిష్యత్తులో చాకోస్‌ ఎక్స్‌ప్రెస్‌ అవుట్‌లెట్స్‌ను మరిన్ని నగరాలకు విస్తరించాలనే ప్రణాళిక రచిస్తున్నట్లు ఉషా పోలు చెబుతున్నారు.

ఇదీ చదవండి:Chicken And Meat Prices: ముక్క ముట్టాలంటే రూ. వెయ్యి పెట్టాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details