తెలంగాణ

telangana

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు

By

Published : Apr 30, 2022, 4:22 PM IST

PAPER LEAK: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు నల్లచెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ.. పోలీసుల అదుపులో ప్రధానోపాధ్యాయుడు

PAPER LEAK: ఏపీలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కలకలం సృష్టిస్తోంది. పరీక్షలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే.. రోజుకో ప్రాంతంలో ప్రశ్నపత్రం లీకేజీ వార్తలు బయటకొస్తున్నాయి. కొవిడ్​ వల్ల ఇప్పటికే విద్యార్థుల విలువైన సమయం వృథాగా పోయింది. తాజాగా ప్రశ్నపత్రాల లీక్​ వ్యవహారం ఇటు విద్యార్థుల్లోనూ.. అటు తల్లిదండ్రుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈ వార్తలపై విచారణ జరుపుతున్న అధికారులు.. చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతున్నా.. లీకేజీ పరంపర ఆగడం లేదు. తాజాగా ఆంగ్లం ప్రశ్నపత్రం లీకేజీపై చర్యలు తీసుకున్నారు.

శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లాలో పదో తరగతి ఆంగ్ల ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో.. నల్లచెరువు ఉన్నత పాఠశాల హెచ్‌ఎంపై అధికారులు చర్యలు తీసుకున్నారు. నల్లచెరువు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విజయకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల గాండ్లపెంట చీఫ్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న విజయకుమార్‌.. గాండ్లపెంట నుంచి ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని వాట్సప్‌లోకి పంపినట్లు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు.

లీక్​ల పరంపర:రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత.. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షల నిర్వహణపై వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. 27, 28 తేదీల్లో తెలుగు, హిందీ పేపర్లు ప్రారంభమైన గంటన్నర తర్వాత బయటకు వచ్చాయని, దీన్ని లీక్‌గా భావించబోమని అధికార యంత్రాంగం ప్రకటించింది. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంగ్ల పరీక్ష మొదలైన 8 నిమిషాల్లోనే సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో పరీక్షా కేంద్రం నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు ప్రచారం సాగింది. ప్రశ్నపత్రాలను తెరిచే సమయంలోనే సెల్‌ఫోన్లతో ఫొటోలు తీస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రోజు ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తుంటే.. ఇలాంటి పరీక్షలు ఎందుకు నిర్వహించడమని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉమ్మడి ప్రశ్నపత్రంతో నిర్వహించే సమ్మెటివ్‌-1 పరీక్ష నుంచే ఆయా ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వస్తూనే ఉన్నాయి. ఇవి పబ్లిక్‌ పరీక్షలు కానందున అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అప్పట్లోనే ఈ లీక్‌పై కఠిన చర్యలు తీసుకుని ఉంటే.. పదో తరగతి పరీక్షల్లో కొంత వరకు అడ్డుకట్ట పడి ఉండేదని పలువురు భావిస్తున్నారు.

ఇవీ చూడండి..

sub committee on schools: ఈ ఏడాది నుంచే ఆంగ్లమాధ్యమంలో బోధన: సబిత

15 ఏళ్లుగా నాణేలు పోగుచేసి స్కూటీ కొనుగోలు.. లెక్కించలేక తంటాలు!

ABOUT THE AUTHOR

...view details