తెలంగాణ

telangana

టమాట రైతులకు అండగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

By

Published : Dec 27, 2020, 3:14 PM IST

మహర్షి సినిమాలో రైతులు పండించిన కూరగాయలను నగరాలకు తీసుకువచ్చి అపార్ట్​మెంట్లలో విక్రయిస్తారు. ఈ విధానంతో ఇటు రైతులు లాభపడతారు. అటు కొనుగోలుదారులు ఎలాంటి రసాయనాలు లేని తాజా కూరగాయలు పొందుతారు. అచ్చం ఇలానే రైతులు పండించిన తాజా టమాటలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా హైదరాబాద్​కు తీసుకువచ్చి పలు ప్రాంతాల్లో విక్రయిస్తోంది ఫోరం ఆఫ్‌ ఐటీ ప్రొఫెషనల్స్‌ ఫర్‌ ఐటీ సంస్థ.

software employees helped Nalgonda tomato farmers
టమాటా రైతులకు అండగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

అన్నదాతకు ఆపన్నహస్తం అందించేందుకు సాఫ్ట్​వేర్ నిపుణులు ముందుకొచ్చారు. మార్కెట్​లో టమాట ధరలు పడిపోవడం వల్ల గిట్టుబాటు కాక కుంగిపోతున్న కర్షకులను తమవంతు ఆదుకోవడానికి ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఫర్ ఐటీ సంస్థ నడుం బిగించింది.

టమాటా రైతులకు అండగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

రవాణా ఖర్చు మాత్రమే

గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సాగు చేసిన టమాటను తీసుకువచ్చి జంట నగరాల్లో కిలో రూ.15 నుంచి రూ.20ల చొప్పున విక్రయిస్తున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అన్నదాతలకు సాయం చేయాలనే ఉద్దేశంతో కేవలం రవాణా ఖర్చులు మాత్రం తీసుకుని మిగతా నగదును రైతులకు అందజేస్తున్నారు.

పల్లె టమాట పట్నానికి

నల్గొండ జిల్లా హాలియా, కట్టంగూరు ప్రాంతాల నుంచి టమాటాలను తెప్పించి.. కూకట్‌పల్లి, జేఎన్​టీయూ, మియాపూర్‌, పటాన్‌చెరు, మణికొండ, అత్తాపూర్‌, ఉప్పల్‌లో విక్రయించారు. 100 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు స్వయంగా విక్రయాలు ప్రారంభించగా.. కేవలం గంట వ్యవధిలోనే అమ్మకాలు పూర్తైనట్లు వెల్లడించారు. రైతు బజార్లు, మార్కెట్ల ధరలతో పోల్చుకుంటే తక్కువ ఉండటం వల్ల వినియోగదారులు పోటీపడి కొనుగోలు చేశారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో టమాటాల విక్రయం ప్రచారం చేయగా.. ఫోన్‌లో బుక్ చేసుకుని.. ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారని వెల్లడించారు.

ఇంకా కావాలి

ఈ ప్రయత్నానికి అనూహ్య స్పందన వచ్చిందని, ప్రతి వారం తమకు టమాట కావాలని విజ్ఞప్తులు వచ్చాయని సంస్థ అధ్యక్షుడు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ విషయంపై సమాలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. రైతులు ఎదుర్కొంటున్న మార్కెటింగ్, గిట్టుబాటు ధర సమస్య నుంచి బయటపడేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details