తెలంగాణ

telangana

సచివాలయంలో కొవిడ్ కలకలం... పలువురు ఉన్నతాధికారులకు వైరస్​

By

Published : Jan 18, 2022, 3:20 PM IST

BRK Bhavan Covid Cases: రాష్ట్రంలో కరోనా విజృభణ కొనసాగుతోంది. రోజు రెండు వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వైద్యులు, అధికారులు, పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పలువురు ఐఏఎస్​ అధికారులకు వైరస్​ సోకింది.

Corona
Corona

BRK Bhavan Covid Cases: సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్కే భవన్​లో కొవిడ్ కలకలం కొనసాగుతోంది. పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఐఏఎస్ అధికారులు సందీప్ కుమార్ సుల్తానియా, శ్రీనివాసరాజుకు పాజిటివ్ నిర్ధరణ అయింది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పలువురికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాదాపు పాతిక మంది వరకు కొవిడ్ బారిన పడ్డట్లు సమాచారం. పేషీల్లోని సిబ్బందికి పాజిటివ్ రావడంతో ఒకరిద్దరు అధికారులు హోంఐసోలేషన్​లో ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు కొవిడ్ బారిన పడి కోలుకున్నారు.

గాంధీలో భారీగా

Gandhi Hospital Corona: వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. ఇప్పటి వరకూ గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియాలో పాజిటివ్‌ వచ్చిన వైద్య సిబ్బందికి గతంలో 15 రోజుల సెలవులు ఇవ్వగా.. ప్రస్తుతం వారానికి కుదిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.బి.నాగేందర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో 22,197 క్రియాశీల కేసులు

Telnagana Corona Cases: రాష్ట్రంలో సోమవారం 2,447 కొవిడ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 7,11,656కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో 3 మరణాలు సంభవించగా ఇప్పటి వరకూ 4,060 మంది కన్నుమూశారు. వైరస్‌ బారిన పడి చికిత్స పొందిన అనంతరం తాజాగా 2,295 మంది కోలుకోగా మొత్తంగా 6,85,399 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 80,138 నమూనాలను పరీక్షించగా మొత్తం పరీక్షల సంఖ్య 3,07,09,658కి పెరిగింది. మరో 10,732 నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,112 పాజిటివ్‌లుండగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 235, రంగారెడ్డిలో 183, హనుమకొండలో 80, సంగారెడ్డిలో 73, మంచిర్యాలలో 68, ఖమ్మంలో 63, నిజామాబాద్‌లో 55 ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 50 కంటే తక్కువ సంఖ్యలో పాజిటివ్‌లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 2,68,897 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు. ఇందులో 69,900 మంది తొలి డోసును, 1,80,065 మంది రెండో డోసును, 18,932 మంది ముందస్తు నివారణ డోసును స్వీకరించారు.

ఇదీ చదవండి :'రెండో డోసు, బూస్టరు డోస్ మధ్య గడువు తగ్గించండి'

ABOUT THE AUTHOR

...view details