తెలంగాణ

telangana

Osmania Hospital record: ఉస్మానియా ఆస్పత్రి మరో ఘనత.. విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స పూర్తి

By

Published : Dec 14, 2021, 10:44 PM IST

Osmania Hospital record: ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. తొలిసారి చర్మమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతగా పూర్తి చేశారు. బ్రెయిన్​డెడ్​ అయిన వ్యక్తి నుంచి సేకరించిన చర్మాన్ని.. విద్యుదాఘాతంతో గాయపడిన యువకునికి విజయవంతంగా అమర్చి.. ప్రాణాలు కాపాడారు.

Osmania Hospital another credit for successful of  skin transplantation surgery
Osmania Hospital another credit for successful of skin transplantation surgery

Osmania Hospital record: ఉస్మానియా ఆస్పత్రిలో తొలిసారి చర్మమార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది నవంబరు 26న విద్యుదా​ఘాతంతో తీవ్ర గాయాలైన నవీన్‌(21) అనే యువకుడు ఉస్మానియా అత్యవసర విభాగంలో చేరాడు. కాలిన గాయాలకు చికిత్స అందించిన వైద్యులు.. ఇటీవలే చర్మమార్పిడి చేశారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి గతంలో సేకరించి భద్రపరిచిన చర్మాన్ని యువకుడికి అమర్చారు. రెండు కాళ్లకు కొత్త చర్మంతో గ్రాఫ్టింగ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. లోపల గాయాలు మానిన తర్వాత నెమ్మదిగా అతికించిన చర్మం ఊడిపోయి.. ఆ ప్రాంతంలో కొత్త చర్మం పుట్టుకొస్తుందని ఉస్మానియాకు చెందిన ప్లాస్టిక్‌ సర్జరీ నిపుణులు డాక్టర్‌ నాగప్రసాద్‌ తెలిపారు.

30 నుంచి 40 శాతానికి మించి కాలితే.. బాధితులను ప్రాణాలు కాపాడటం కష్టమే. ఇలాంటి వారికి గాయాలైన చోట చర్మం అతికించాలి. ఇప్పటి వరకు బాధితుడి శరీరం నుంచే చర్మాన్ని సేకరించి గ్రాఫ్టింగ్‌ చేసేవారు. ఎక్కువ గాయాలైన సందర్భంలో బాధితుడి నుంచి పూర్తి స్థాయిలో సేకరించడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన చర్మాన్ని బాధితులకు అతికిస్తారు. నవీన్​కు చర్మాన్ని విజయవంతంగా మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదించారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన మంత్రి హరీశ్​ రావు... వైద్యుల పనితీరును ప్రశంసించారు.

46 రోజుల తర్వాతే వినియోగం...

ప్రస్తుతం బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కళ్లు సేకరించి ఇతరులకు అమర్చుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని జీవన్‌దాన్‌ ట్రస్టు అనుమతి ఇస్తోంది. చర్మ దానం చేసేటప్పుడు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచే కాక... ప్రమాదాల్లో మృతిచెందిన వారి నుంచి కూడా కుటుంబ సభ్యుల అనుమతితో 12 గంటల్లోపు చర్మాన్ని సేకరించి భద్రపర్చవచ్చు. ఇలా సేకరించిన చర్మాన్ని 5 ఏళ్ల వరకు భద్ర పరిచేందుకు వీలుందని వైద్యులు తెలిపారు. గతంలో అపోలో, గ్లోబల్‌ ఆసుపత్రిల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన ఇద్దరు వ్యక్తుల నుంచి 1800 చదరపు సెంటీమీటర్ల చర్మాన్ని సేకరించి ఉస్మానియా చర్మ బ్యాంకులో భద్రపర్చారు. ఇలా సేకరించిన చర్మాన్ని 46 రోజుల తర్వాతే ఇతరులకు వినియోగించేందుకు ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా బ్యాంకులో నిల్వ ఉన్న చర్మంతో మరో ముగ్గురికి చికిత్స చేయవచ్చునని వైద్యులు తెలిపారు.

చర్మ బ్యాంకు ద్వారానే సాధ్యం...

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో ఏటా వేయి వరకు ప్లాస్టిక్‌ సర్జరీలు జరుగుతున్నాయి. కాలిన గాయాలు, చేతికి, కాళ్లకు శరీరంపై ఇతర భాగాల్లో తీవ్ర గాయాలు, గ్రహణం మొర్రి, కుష్ఠు వ్యాధితో వంకరైన చేతులు, కాళ్లు సరిచేయడం, తెగిన చేతులు, వేళ్లు అతికించడం... ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతోంది. ఇప్పటివరకు రోగి శరీరంలోనే కాళ్లు, చేతులు, తొడలు, పుర్రె తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్‌ ద్వారా గాయాలైన చోటు అమర్చుతున్నారు. అయితే రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతేకంటే ఎక్కువ చర్మం కావాల్సిన వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఉస్మానియాలో ఏర్పాటు చేసిన చర్మబ్యాంకుతో ఇది సాధ్యమవుతోంది. మరింత మందికి మేలు జరగాలంటే బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి చర్మం సేకరించేలా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details