తెలంగాణ

telangana

పేదల ప్రాణాలు నిలుపుతున్న నిమ్స్.. బిహార్‌ వాసికి అరుదైన శస్త్రచికిత్స

By

Published : Apr 7, 2021, 4:30 AM IST

మారుతున్న జీవన విధానంతో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. కానీ చికిత్స మాత్రం ఇప్పటికీ పేదలకు అందని ద్రాక్షే. కానీ అలాంటివారికి నిమ్స్ ఆస్పత్రి అండగా నిలుస్తోంది. అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో చికిత్స అందిస్తూ... వేల మంది రోగుల ప్రాణాలు నిలుపుతోంది.

nims Cardio doctors successfully completed an operation to bihar man who suffering with heart problem
పేదల ప్రాణాలు నిలుపుతున్న నిమ్స్.. బిహార్‌ వాసికి అరుదైన శస్త్రచికిత్స

పేదల ప్రాణాలు నిలుపుతున్న నిమ్స్.. బిహార్‌ వాసికి అరుదైన శస్త్రచికిత్స

పేదల కార్పొరేట్‌ ఆస్పత్రి నిమ్స్‌...అరుదైన శస్త్ర చికిత్సలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఖరీదైన గుండె సంబంధిత శస్త్ర చికిత్సలనూ పేదలకు చేరువ చేస్తూ ప్రాణాలు నిలుపుతోంది. తాజాగా బిహార్‌కు చెందిన 62 ఏళ్ల సుగ్నాకర్‌కు..... ఎన్నో ఏళ్ల వేదన నుంచి విముక్తి కల్పించారు. సాధారణ మనుషుల్లో గుండె నిమిషానికి 70నుంచి 80 సార్లు కొట్టుకుంటే.... సుగ్నాకర్‌ గుండె నిమిషానికి 180 నుంచి 250సార్లు కొట్టుకునేది. లక్షల్లో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన గుండె దడతో సుగ్నాకర్‌ కళ్లుతిరిగి పడిపోయేవాడు. బిహార్‌, దిల్లీలోని పేరుమోసిన ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. గత నెల 25న నిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన సుగ్నాకర్‌కు.... నిమ్స్‌ కార్డియాలజీ విభాగాధిపతి సతీశ్​ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం అరుదైన చికిత్స చేసింది. 3రోజులపాటు శ్రమించి తాము ఈ చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. నిమ్స్‌ వైద్యులు తమపాలిట దేవుళ్లంటూ సుగ్నాకర్‌ ఉద్వేగానికి గురయ్యాడు.

150 పడకలు..

సుగ్నాకర్‌ వంటి ఎంతో మందికి నిమ్స్ పునర్జన్మను ప్రసాదిస్తోంది. ఆసుపత్రి కార్డియాలజీ విభాగంలో 150 పడకలున్నాయి. గుండె సంబంధిత రోగాలతో నిత్యం 200మంది రోగులు వస్తున్నారు. నిమ్స్‌ వైద్యులు రోజూ 20 మందికి యాంజియోగ్రామ్ చేస్తూ....అవసరమైన వాళ్లకు స్టంట్లు వేస్తున్నారు. పాత భవనంలో ఉన్న కార్డియాలజీ విభాగాన్ని నాలుగేళ్ల క్రితం స్పెషాలిటీ బ్లాక్‌లోకి మార్చారు. 2017లోనే రెండు క్యాథ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు.

కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే..

నాలుగు యూనిట్లలో ప్రత్యేక వైద్యులతో పాటు డీఎం విద్యనభ్యసించే మరో 24 మంది వైద్యులు ఉన్నారు. తెల్లరేషన్ కార్డు, ఆర్టీసీ, ఈహెచ్​ఎస్​,సీజీహెచ్​ఎస్​, పోలీసు భద్రతా పథకం కింద ఆయా ఉద్యోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. వైద్యానికి అయిన ఖర్చును ప్రభుత్వం, నిమ్స్ ఆస్పత్రి ఖాతాలో జమ చేస్తోంది. కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే.... నిమ్స్‌లో వైద్యానికి 4వ వంతు మాత్రమే ఖర్చవుతోంది. కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో నిమ్స్‌లో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని..కార్డియాలజీ విభాగాధిపతి సతీశ్​ చెబుతున్నారు. రోగుల తాకిడి పెరుగుతున్న దృష్ట్యా మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని వైద్యులు కోరుతున్నారు.


ఇవీ చూడండి:'2021లో 12.5 శాతానికి దేశ జీడీపీ'

ABOUT THE AUTHOR

...view details