తెలంగాణ

telangana

Rythu Bandhu Funds: యాసంగిలో 66.56 లక్షల మందికి రైతుబంధు సాయం!

By

Published : Dec 25, 2021, 5:24 AM IST

Rythu Bandhu Funds: యాసంగిలో రైతుబంధు సాయం పొందే లబ్దిదారుల సంఖ్యతో పాటు మొత్తం పెరగనుంది. వానాకాలం పంట సాయంగా రూ.7,377 కోట్లు అందించగా ఈ మారు ఆ మొత్తం రూ.7,600 కోట్లు దాటనుంది. లబ్దిదారుల సంఖ్య కూడా ఐదు లక్షల వరకు పెరగనుంది. మంగళవారం నుంచి రైతుబంధు చెల్లింపుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Rythu Bandhu Funds
Rythu Bandhu

Rythu Bandhu Funds: పంట పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు త్వరలో రైతులకు అందనుంది. యాసంగి సీజన్​కు సంబంధించిన సాయాన్ని ఈనెల 28 నుంచి అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.7,600 కోట్ల పైగా సాయం..

గత సీజన్​తో పోలిస్తే ఈ మారు రైతుబంధు సాయం పొందే లబ్ధిదారుల సంఖ్యతో పాటు అందించే నగదు మొత్తం కూడా పెరగనుంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాల జారీతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. సాగు చేసే భూముల విస్తీర్ణం కూడా పెరిగింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ అనుసంధానం కూడా పూర్తికావడంతో రైతుబంధు సాయం పొందే వారితో పాటు భూవిస్తీర్ణం పెరిగింది. వానాకాలం సీజన్​లో 61.08 లక్షల మందికి 7,377 కోట్ల రూపాయలు రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్​లో లబ్ధిదారుల సంఖ్య 66.56 లక్షలకు పెరిగింది. వారికి రూ.7,600 కోట్ల పైగా సాయం అందనుంది. సాగయ్యే భూముల విస్తీర్ణం పెరగడంతో మరో 300 కోట్ల మేర అదనంగా రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.

జనవరి మొదటి వారానికి..

అటు రైతుబంధు చెల్లింపుల కోసం అవసరమైన మొత్తాన్ని ఆర్థికశాఖ సమకూర్చుకుంటోంది. ఖజానాకు వచ్చే ఆదాయంతో పాటు రుణాల ద్వారా సమకూర్చుకునే మొత్తాన్ని ఇందుకు వినియోగించనుంది. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 3,500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం... మరో 2000 కోట్లు రుణంగా తీసుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా బాండ్లు జారీ చేసింది. ఈనెల 28న ఈ బాండ్ల విక్రయంతో రెండు వేల కోట్ల మొత్తం సమకూరనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు. తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణ క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది.

ఇదీచూడండి:Inter first year results: విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఫెయిలైనోళ్లంతా పాస్‌..

ABOUT THE AUTHOR

...view details