తెలంగాణ

telangana

కోలాహలంగా అంజనీపుత్రుని శోభాయాత్ర.. మారుమోగుతోన్న జైహనుమాన్​ నినాదాలు..

By

Published : Apr 16, 2022, 1:13 PM IST

hanuman jayanti 2022: హనుమన్​ జయంతి వేడుకలు హైదరాబాద్​లో ఘనంగా నిర్వహిస్తున్నారు. పవనసుతుని జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఎంతో వైభవంగా ఆంజనేయుని శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ శోభాయాత్రలో భక్తులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

hanuman jayanti 2022 celebrations in hyderabad
hanuman jayanti 2022 celebrations in hyderabad

కోలాహలంగా అంజనీపుత్రుని శోభాయాత్ర.. భారీసంఖ్యలో పాల్గొన్న భక్తులు..

hanuman jayanti 2022: హైదరాబాద్ లో హనుమాన్‌ జయంతి వేడుకలు... అంబరాన్నంటాయి. హనుమంతుని ప్రధాన ఆలయాలు.. భక్తులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లోని ఆంజనేయ ఆలయాల నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. నగర రహదారులన్ని హనుమాన్​ నామస్మరణతో.. కాషాయ వర్ణంతో.. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

గౌలిగూడలోని రామ మందిరంలో... హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గౌలిగూడ నుంచి తాడ్‌బండ్‌ వరకు ప్రతిష్ఠాత్మకంగా శోభాయాత్ర ప్రారంభించారు. వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు, కార్యకర్తలతో శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ కర్మన్‌ ఘాట్‌ హనుమాన్​ ఆలయం నుంచి శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. కర్మన్‌ ఘాట్‌ హనుమాన్ దేవాలయం నుంచి తాడ్‌బండ్‌ వరకు 21కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగనుంది. కశ్మీర్‌ ఫైల్స్‌ సినీమా నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ హనుమాన్ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చంపాపేట్‌, ఐఎస్ సదన్‌, సైదాబాద్, సరూర్‌నగర్ మీదుగా హనుమాన్ శోభయాత్ర కొనసాగుతోంది. భాగ్యనగర్ ప్రజాహిత సమితి ఆధ్వర్యంలో వేలాదిమంది భక్తులు, కార్యకర్తలు శోభాయాత్రలో పాల్గొన్నారు. జై హనుమాన్​, జై శ్రీరామ్​ నినాదాలతో రహదారులు మారుమోగిపోతున్నాయి.

హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా తాడ్​బండ్​ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయంలో అంజనీపుత్రుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భజన కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details