తెలంగాణ

telangana

GRMB MEETING: ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి: తెలంగాణ

By

Published : Aug 3, 2021, 12:04 PM IST

Updated : Aug 3, 2021, 3:07 PM IST

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

12:02 August 03

గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి: తెలంగాణ

హైదరాబాద్ జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శులు బీపీ పాండే, రాయిపురే, బోర్డు సభ్యులు, కేంద్ర జలశక్తి శాఖ ప్రతినిధి హాజరయ్యారు. వీరితో పాటు ఏపీ ఈఎన్​సీలు నారాయణరెడ్డి, సతీశ్​, ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్‌ సమావేశంలో పాల్గొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సభ్యులు హాజరుకాలేదు. ఈ భేటీలో గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చ జరిగింది. 

గెజిట్‌ గడువు ప్రకారం ప్రాజెక్టుల స్వరూపం ఇతర వివరాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి బోర్డులు తెలిపాయి. నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నాయని ఏపీ సభ్యులు తెలిపారు. తమ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఏపీ ఈఎన్‌సీ అన్నారు. అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమన్నారు. వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించాయి. తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఏపీ ఈఎన్‌సీ బోర్డులకు వివరించారు. సమన్వయ కమిటీ సమావేశాలు తరచూ జరుగుతాయని బోర్డులు తెలిపాయి. రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్ఎంబీ తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాలపై మరింత స్పష్టత కోరామని ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. తమ రాష్ట్రం ఎప్పుడూ నిబంధనలు ఉల్లంఘించలేదని అన్నారు. 

గెజిట్‌లోని కొన్ని అంశాలపై స్పష్టత కోరాం...

'గెజిట్ నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాలపై స్పష్టత కోరాం. గెజిట్‌లోని కొన్ని అంశాల్లో మాకు అభ్యంతరాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పాం. బోర్డులపై ఎక్కువ భారం అవసరం లేదు. సాధారణ అంశాల్లో బోర్డుల జోక్యం అవసరం లేదు. క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూడటం మేలు. అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బోర్డులకు వివరాలు ఇస్తాం. తెలంగాణ సభ్యులు ఎందుకు హాజరుకాలేదో తెలియదు. మేం నిబంధనలు, నియమాలు గౌరవిస్తాం.'

- ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి

కాగా.. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్​సీ సోమవారం లేఖ రాశారు. ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని ఈఎన్​సీ కోరారు. బోర్డు పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ భేటీ జరగాలన్నారు. మరోవైపు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగాకే.. సమన్వయ కమిటీ భేటీ జరగాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Aug 3, 2021, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details