తెలంగాణ

telangana

Famous personalities from Pedakallepalli : మహనీయుల పుట్టినిల్లు..పెదకళ్లేపల్లి

By

Published : Jan 9, 2022, 11:38 AM IST

Famous personalities from Pedakallepalli : తెలుగుజాతికి వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన గ్రామమది.. తెలుగు భాష, సాహిత్యం, సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డల సొంత ఊరు.. కళలకు కాణాచి.. కృష్ణమ్మ ఉత్తరవాహినిగా పరవళ్లు తొక్కుతున్న ఆ పల్లెటూరు.. దక్షిణకాశీగానూ ఖ్యాతిగాంచింది..!ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..? ఆ మహనీయులు ఎవరో తెలియాలంటే కృష్ణా జిల్లాకు వెళ్లాల్సిందే..

Famous personalities from Pedakallepalli, Pedakallepalli  story
మహనీయుల పుట్టినిల్లు..పెదకళ్లేపల్లి

మహనీయుల పుట్టినిల్లు..పెదకళ్లేపల్లి

Famous personalities from Pedakallepalli : ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి.. ఈ గ్రామం పేరు వింటేనే అక్కడ జన్మించిన ఎందరో మహానుభావులు... స్ఫురణకు వస్తారు. జాతికి, తెలుగు సాహిత్యానికి వారు చేసిన సేవలు స్మరణకు వస్తాయి. తెలుగు సంస్కృతి పరివ్యాప్తికి దోహదం చేసిన మహోన్నతమైన గ్రామం పెదకళ్లేపల్లి. త్యాగరాజు సంగీత పరంపరను ఆ రాష్ట్రానికి తీసుకొచ్చి.. వర్ధిల్లజేసిన సుచర్ల దక్షిణామూర్తి పుట్టిన గ్రామం. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చి.. అన్నమాచార్యుని వెలుగులోకి తెచ్చిన మహనీయుడు.. వేటూరి ప్రభాకరశాస్త్రికి జన్మనిచ్చిన ఊరు. భావ కవిత్వానికి అంకురార్పణ చేసి.. హంపి క్షేత్ర కావ్యం ద్వారా సాహిత్య చరిత్రలో అజరామరంగా నిలిచిన.. కొడాలి వెంకటసుబ్బారావు పుట్టింది ఇక్కడే. స్వాతంత్య్రోద్యమ ధీరుడు, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జన్మించి.. విద్యనభ్యసించిందీ పెదకళ్లేపల్లిలోనే. అమర గాయకుడు, గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత ప్రస్థానానికి అంకురార్పణ పడిందీ ఈ గ్రామంలోనే. పక్కనే ఉన్న టేకుపల్లెలో జన్మించిన ఘంటసాల.. పెదకళ్లేపల్లిలోనే సుచర్ల దక్షిణామూర్తి వద్ద సంగీత విద్యను అభ్యసించి.. జ్ఞానాన్ని సముపార్జించారు. తెలుగు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం కల్పించిన వేటూరి సుందరరామ్మూర్తికి పురుడపోసిందీ పెదకళ్లేపల్లి గ్రామమే.

స్వాతంత్య్రోద్యమంలోనూ కీలక పాత్ర పోషించిందీ గ్రామం. బౌద్ధ యుగంలోనూ వర్ధిల్లిందీ ఊరు. పెదకళ్లేపల్లి చరిత్రను అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో.. ఆ గ్రామంలో జన్మించిన మహనీయుల మూర్తులను ఆవిష్కరింపజేశారు మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్. సుచర్ల దక్షిణామూర్తి, వేటూరి ప్రభాకరశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి, కొడాలి వెంకటసుబ్బారావు విగ్రహాలను స్థాపించారు.

"పెదకళ్లేపల్లి చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో అక్కడ పుట్టినటువంటి మహామనుభావుల విగ్రహాలను ఏర్పాటు చేశాం. వారిని చూసి స్ఫూర్తి పొందుతారని...ముందుకు వెళ్లేందుకు ఉత్తేజాన్ని కలగజేస్తాయనే భావనతో ఏర్పాట చేశాం" -మండలి బుద్ధప్రసాద్‌, మాజీ ఉప సభాపతి

పెదకళ్లేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచింది. గ్రామానికి ఉత్తరవాహినిగా కృష్ణా నది ప్రవహిస్తుండటం వల్ల.. దీనికి ఆ పేరు వచ్చింది. శివరాత్రికి శ్రీశైలం తర్వాత ఎక్కువగా భక్తులు వచ్చేది పెదకళ్లేపల్లికేనని గ్రామస్తులు చెబుతారు. పితృదేవతలకు పిండతర్పణ చేస్తే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని.. మహాశివరాత్రికి వేలాదిగా భక్తులు తరలివచ్చి.. నదీస్నానాలు చేస్తుంటారు.

"దక్షిణ కాశీగా పేరుపొందిన పెదకళ్లేపల్లిలో మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించి ప్రతీ యేడాది వారి జయంతి, వర్ధంతులను జరుపుతూ రాబోయే తరాలకు వారి స్ఫూర్తిని అందించేందుకు ప్రయత్నిస్తున్నాం" -సీతారామాంజనేయులు, ఎంపీటీసీ

తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు దేశవ్యాప్తంగా వ్యాపింపచేసిన పెదకళ్లేపల్లి గ్రామంలో.. మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు.

ఇదీ చదవండి :Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

ABOUT THE AUTHOR

...view details