తెలంగాణ

telangana

Anandaiah Drug: రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ

By

Published : Jun 6, 2021, 7:10 AM IST

సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామానికి చెందిన బొనిగి ఆనందయ్య వెల్లడించారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందించి, అనంతరం మిగతా ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు.

ap news
ఏపీ వార్తలు

సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని బొనిగి ఆనందయ్య వెల్లడించారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. అనంతరం మిగతా ప్రాంతాల వారికి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు.

మందు పంపిణీ కోసం రూపొందించిన వెబ్‌సైట్‌తో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేదని ఆనందయ్య పేర్కొన్నారు. ఈ విషయంపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని, తనను రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు. తెలంగాణ నుంచి యాదవ సంఘం వారు వచ్చి పరిశీలించి అభినందనలు తెలిపారని…. వారిపై లాఠీఛార్జి చేసినట్లు సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమని స్పష్టం చేశారు. వివాదాల్లోకి లాగకుండా ప్రజల సేవచేయడంలో సహకారం అందించాలని ఆనందయ్య కోరారు.

మందు అమ్మకానికి పెట్టారు: సోమిరెడ్డి

ఆనందయ్య మందుతో వ్యాపారం చేసేందుకు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుట్ర చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. మందు అమ్మకానికి వెబ్‌సైట్‌ తయారుచేసింది నెల్లూరుకు చెందిన సెశ్రిత కంపెనీ అని వెల్లడించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి గౌతమ్‌రెడ్డి, కాకాణి ఫొటోలు, వైకాపా గుర్తు, రంగులతో జూన్‌ 2న వెబ్‌ పేజీ సిద్ధం చేశారు. మందుకు రూ.15 ధర నిర్ణయించి, కొరియర్‌ ఖర్చులు, జీఎస్‌టీ కలిపి రూ.167లకు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. వీటిని చూసిన ఆనందయ్య కుటుంబం ప్రశ్నించడంతో వెబ్‌సైట్‌ను తొలగించి.. ఆ మందుతో పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలి. వెబ్‌సైట్‌ వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఆధారాలివ్వండి.. విచారణ చేయిస్తాం: కాకాణి

సెశ్రిత టెక్నాలజీ ఎవరిదో తమకు తెలియదని.. దీనిపై సిట్టింగ్‌ జడ్జి, రిటైర్డ్‌ హైకోర్టు జడ్జితో విచారణ చేయించేందుకైనా సిద్ధమని వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. ‘సోమిరెడ్డి వద్ద ఉన్న ఆధారాలు తీసుకురావాలి. ఆయన నీతిమంతుడైతే సెశ్రిత టెక్నాలజీపై కోర్టులో కేసు వేయాలి. ఆనందయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవడంతో జీర్ణించుకోలేక దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. ఆనందయ్య మందు పంపిణీతో పార్టీకి, నాకు సంబంధం లేదు. నేను తప్పు చేశానని.. ఎక్కడైనా అవినీతి జరిగిందని రుజువు చేస్తే ప్రజల సమక్షంలో ఉరి వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా'నని కాకాణి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Markfed: మార్క్‌ఫెడ్, ప్రభుత్వం మధ్య నలిగిపోతున్న అన్నదాత

ABOUT THE AUTHOR

...view details