తెలంగాణ

telangana

CONGRESS PAC MEETING: హుజూరాబాద్‌లో కాంగ్రెస్​ ఓట్లు ఏమయ్యాయి?

By

Published : Nov 4, 2021, 5:48 AM IST

గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ నేతృత్వంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడీవేడిగా జరిగింది. హజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అత్యంత తక్కువగా మూడువేల ఓట్లే రావడం ఏమిటి? పార్టీ ఓట్లు ఏమయ్యాయి? అనే రెండు అంశాల ప్రాతిపదికగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఫలితాలను విశ్లేషించేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.

congress pac meeting
congress pac meeting

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పార్టీ ఓటమి, కాంగ్రెస్ సభ్యత్వం, డిసెంబరు 9న నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభలపై చర్చించేందుకు ఏర్పాటైన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్​ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్యనేతలు గీతారెడ్డి, రేణుకాచౌదరి, దామోదర రాజనరసింహా, మధుయాస్కీ తదితరులు హాజరయ్యారు.

మూడువేల ఓట్లే రావడం ఏమిటి?

హజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు అత్యంత తక్కువగా మూడువేల ఓట్లే రావడం ఏమిటి? పార్టీ ఓట్లు ఏమయ్యాయి? అనే రెండు అంశాల ప్రాతిపదికగా సుదీర్ఘంగా సమావేశం జరిగింది. సమావేశం ఆరంభంలోనే పలువురు నేతలు హుజూరాబాద్‌లో అభ్యర్థి ఎంపికపై చర్చను లేవనెత్తారు. స్థానిక నాయకులను కాదని, వేరే నియోజకవర్గం అభ్యర్థిని నిలపడం ఏమిటని ప్రశ్నించారు. అలాంటపుడు అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఎందుకు స్వీకరించారని నిలదీశారు. అభ్యర్థిని ముందుగా ప్రకటించకపోవడం కూడా నష్టం కలిగించిందని మరికొందరు అన్నారు. ఆరంభం నుంచి ఎన్నిక పట్ల శ్రద్ధ చూపలేదని, తెరాస, భాజపా పోరుగా చూడటం మినహా పార్టీ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా ప్రయత్నాలు జరగలేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

ఫలితాలపై కమిటీ..

స్థానికంగా ఉన్న బీసీ, ఎస్సీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండేది కాదని వీహెచ్​ సహా కొందరు అభిప్రాయపడగా, జిల్లా నేతలతో చర్చించిన తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేసినట్టు పీసీసీ ముఖ్యులు స్పష్టం చేశారు. ఫలితాలను విశ్లేషించేందుకు కమిటీని ఏర్పాటుచేయాలని చివరిగా నిర్ణయించారు.

భట్టీ-రేణుకా మద్య మాటల యుద్ధం..!

పార్టీకి సంబంధించిన అంశాలను అంతర్గతంగానే చర్చించుకోవాలని, బహిరంగ చర్చకు అవకాశం ఇవ్వవద్దని మాణికం ఠాగూర్‌ స్పష్టం చేశారు. తనవల్లే పార్టీకి నష్టం జరిగిందంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ అభ్యంతరం తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్రమాజీ మంత్రి రేణుకాచౌదరి మధ్య ఒక సందర్భంలో మాటల యుద్ధం జరిగినట్లు తెలిసింది. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో భట్టి ప్రమేయం ఏంటని ఆమె ప్రశ్నించగా, నేను ఏం చేయాలో, ఏం చేయకూడదో అధిష్ఠానం చెబుతుందని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తే తప్పు ఎలా అవుతుందని భట్టి ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. వైస్‌ ఛైర్మన్‌గా రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంఏ ఖాన్‌, సభ్యులుగా ఎ.శ్యాంమోహన్‌, గడ్డం వినోద్‌, సౌదాగర్‌ గంగారాం, బి.కమలాకర్‌రావు, సీజే శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు..

ఇదీచూడండి:TRS vs Farmers: సభకు పొలాలు ఇవ్వమన్నందుకు రైతులపై తెరాస నాయకుడు దాడి

ABOUT THE AUTHOR

...view details