తెలంగాణ

telangana

Minister Anil Kumar: 'మాకు పవన్‌కల్యాణ్‌.. సంపూర్ణేశ్‌బాబు ఇద్దరూ ఒకటే!'

By

Published : Sep 26, 2021, 4:21 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ ఘాటుగా స్పందించారు. పవన్ కోసం ప్రభుత్వం ఇండస్ట్రీని భయపెట్టలా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటే అని స్పష్టం చేశారు.

minister-anil-kumar
minister-anil-kumar

ప్రతిదీ పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎలా తప్పు అవుతుందని ఏపీ మంత్రి అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా ఒకటేనని పేర్కొన్నారు.

‘‘పవన్‌కల్యాణ్‌ కోసం మేము ఇండస్ట్రీని భయపెట్టాలా? ఇదంతా ఏంటి? అసలు ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయి? అదేమంటే ఒకటితో మొదలు పెట్టాం అంటారు. మొన్న జరిగిన జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల్లోనూ ఒక మండలంలో గెలిచారు. ఇలా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లేసరికి పార్టీ చాప చుట్టేస్తుంది. నిర్మాణాత్మక విమర్శలు తీసుకోవడానికి మేం సిద్ధం. ఈ విధానమైతే సరికాదు. ఇలాంటి వాళ్లను ప్రభుత్వం చాలామందిని చూసింది. సోషల్‌మీడియాలో వాళ్లకు అభిమానులు ఉంటారు. వాళ్లు ట్రోలింగ్‌ చేయడం మొదలుపెడతారు. మా గురించి ఎన్ని ట్రోల్స్‌ చేస్తారో మీ ఇష్టం. ఎందుకంటే మమ్మల్ని తలుచుకుంటున్నందుకు ధన్యవాదాలు. కేవలం ఆయనను దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమను ఎందుకు ఇబ్బంది పెడతాం? అసలు ఆయనెవరు? ఆయన వాదనల్లో పొంతన లేదు. మాకు డబ్బులు కావాలంటే టికెట్‌ రేట్లు పెంచుతాం కదా! కానీ, అలా చేయడం లేదు. సినిమా థియేటర్లు ఏమైనా మూసేశామా? రేట్లు పెంచి అమ్మే టికెట్లపై ట్యాక్స్‌ ఎక్కడికిపోతోంది? ఈ ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆన్‌లైన్‌ టికెటింగ్‌పై నిర్ణయం తీసుకున్నారు. దానిలో తప్పేముంది? అదే రూ.200 పెట్టి పోర్టల్‌లో టికెట్లు అమ్మడం, ప్రతిదీ పారదర్శకంగా జరగాలనుకోవడం తప్పా’’

-అనిల్‌కుమార్‌, మంత్రి

‘‘ప్రభుత్వానికి ఏ హీరో సినిమా అయినా ఒకటే! ‘మేమంతా కళామతల్లి ముద్దు బిడ్డలం’ అని మీరే చెబుతారు. అలాంటప్పుడు పవన్‌కల్యాణ్‌ అయినా.. సంపూర్ణేశ్‌బాబు అయినా మాకు ఒకటే. హీరోగా ఇద్దరి కష్టం ఒకటే! సిక్స్‌ ప్యాక్‌ చేసేందుకు సుధీర్‌బాబు, ప్రభాస్‌ ఇద్దరూ ఒకేలా కష్టపడ్డారు. టికెట్‌ రేటు అనేది పెద్దవాడికి ఒకలా.. చిన్నవాడికి మరోలా ఉండకూడదు. ఇద్దరికీ సమానం ఉండాలి. ‘నాకు ఎక్కువమంది అభిమానులు ఉన్నారు రూ.100 టికెట్‌.. రూ.200 కొనండి’ అని ఎవరైనా చెబుతారా? దాన్ని అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవడం అంటారు’’ అంటూ అనిల్‌ కుమార్‌ పవన్‌పై వ్యాఖ్యాలపై తనదైన శైలిలో స్పందించారు.

స్పందించిన సంపూర్ణేశ్ బాబు

మంత్రి అనిల్‌కుమార్‌ వ్యాఖ్యలపై నటుడు సంపూర్ణేశ్‌బాబు స్పందించారు. ‘‘మంత్రి అనిల్ గారు, మంచి మనసున్న మా పవన్‌కల్యాణ్​తో సమానంగా నన్ను చూడటం ఆనందకరం. ఏ సమస్య వచ్చినా పెద్ద మనసుతో స్పందించే తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఎగ్జిబిటర్లు బాధల్లో ఉన్నారు. అదే పెద్ద మనసుతో అవి పరిష్కారం అయ్యేలా చూడగలరు’’ అని సంపూర్ణేశ్​బాబు ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details