తెలంగాణ

telangana

రైతులకు మద్దతుగా రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం

By

Published : Feb 6, 2021, 8:30 PM IST

కొత్త సాగుచట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో... దిల్లీలో ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా... రాష్ట్రంలోనూ రైతులు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు రహదారులను దిగ్బంధించారు. కొత్త వ్యవసాయ చట్టాలు అన్నదాతల నడ్డివిరిచే విధంగా ఉన్నాయంటూ నినదించారు. కర్షకులకు కష్టాలు తెచ్చేలా ఉన్న చట్టాలను తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు మద్దతుగా రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం
రైతులకు మద్దతుగా రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం

రైతులకు మద్దతుగా రాష్ట్రంలో రహదారుల దిగ్బంధం

కొత్త సాగుచట్టాల రద్దు అజెండాగా దిల్లీలో సుదీర్ఘకాలంగా పోరాడుతున్న కర్షకులకు మద్దతుగా... రాష్ట్రంలోనూ అన్నదాతలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కదం తొక్కాయి. జాతీయ రహదారులు సహా రాష్ట్రీయ రహదార్లపై రాస్తారోకోలకు దిగి దిగ్బంధించారు. పలు చోట్ల నిరసన ర్యాలీలు చేపట్టారు. ఎడ్ల బండ్లు, వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. దేశం మొత్తం కర్షకులకు అండగా ఉంటుందని... భరోసా ఇచ్చేలా ఆందోళనల్లో పాల్గొన్నారు.

హైదరాబాద్ శివారు హయత్‌నగర్ బస్‌ డిపో వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రైతులు ఎడ్లబండ్లతో నిరసన తెలిపారు. వామపక్షాలు, కాంగ్రెస్ , తెజస సహా... ఇతర పార్టీల శ్రేణులు రాస్తారోకోలో పాల్గొని హైవేను దిగ్బంధించారు. ఈ క్రమంలో రైతు సంఘాల ప్రతినిధులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట సాగింది. మోదీ సర్కారు మొండితనం వీడి రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సికింద్రాబాద్‌ అల్వాల్‌లో సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగిన ఆందోళనకారులను అరెస్టు చేసి... బొల్లారం ఠాణాకు తరలించారు. అన్నదాతలకు మద్దతుగా... కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉప్పల్ డిపో వద్ద రాస్తారోకో చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం సాగర్ రహదారిపై వామపక్ష, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పరిగిలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై అఖిలపక్ష నేతలు రహదారి దిగ్బంధించి నిరనస తెలిపారు. నల్గొండ చౌరస్తాలో రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి... దిల్లీ రైతు ఆందోళనలకు సంఘీభావం తెలిపారు. మూడు రైతు చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద నార్కెట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై వామపక్ష, రైతు సంఘాల ప్రతినిధులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనకారులను అరెస్టు చేసి నల్గొండ ఠాణాకు తరలించారు. దామరచర్లలో కాంగ్రెస్, మిర్యాలగూడలో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చౌటుప్పల్‌ వామపక్షాల నేతలు విజయవాడ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిపై రైతు సంఘాలు ప్రతినిధులు రాస్తారోకో చేపట్టారు. ఆందోళనలతో మూడుకిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో... రహదారులపై బైఠాయింపు కార్యక్రమాలు జరిగాయి.

కరీంనగర్‌ ఎన్టీఆర్ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో వామపక్ష, కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. ఖమ్మం రాపర్తినగర్‌ వద్ద కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు రహదారి దిగ్భంధం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్ కూడలిలో అఖిలపక్షనేతలు రహదారి దిగ్బంధించి ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్‌ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. రైతులు ఎడ్లబండ్లతో రహదారికి అడ్డంగా నిలిపి నిరసన తెలిపారు. కామారెడ్డి శివారు టెక్రియాల్ రహదారిని దిగ్బంధించారు.

ఇదీ చూడండి:కోదాడ వద్ద 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో

ABOUT THE AUTHOR

...view details