తెలంగాణ

telangana

సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం

By

Published : Jan 24, 2021, 3:38 PM IST

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ రైతు ప్రయోగాత్మకంగా సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న మిర్చి పంట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. మిరప పంటతో లాభాల బాట పట్టడం ఇతరులకు ఆదర్శంగా మారింది. పెట్టుబడి వ్యయం తగ్గడమే కాకుండా మంచి దిగుబడి, లాభాలు వస్తుండటంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

high income with small investment in organic farming
సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం

సేంద్రియ సాగు: పెట్టుబడి కొంచెం.. లాభాలు ఘనం

మిర్చిపంట సాగులో అవలంభిస్తున్న విధానాలతో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన రైతు మంచి లాభాలు గడిస్తున్నాడు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన మిర్చి కావడంతో మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం పిప్పల్‌ధరి గ్రామానికి చెందిన తక్‌సాందే మోహన్‌... తనకున్న ఎకరంన్నర పొలంలో పాలిహౌజ్‌ విధానంలో మిర్చి సాగు చేస్తున్నాడు. సేంద్రీయ పద్ధతులు పాటిస్తుండటంతో ఆశించిన మేర కాపు వస్తోంది. మార్కెట్‌లోనూ మంచి ధర ఉందని... లాభాలు వస్తున్నాయని రైతు మోహన్‌ అంటున్నారు.

ఉద్యానశాఖాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు, సలహాలకు అనుగుణంగా సస్యరక్షణ పద్ధతులు పాటించడంతో క్రిమికీటకాల ప్రభావం కనిపించడం లేదు. ఫలితంగా దిగుబడి ఆశించినమేర వస్తోంది. సేంద్రీయ మిరప పంటను రైతు బజార్లకు తీసుకొచ్చిన క్షణాల్లోనే అమ్ముడుపోతోంది. ఎకరానికి రూ.2లక్షల వరకు పెట్టుబడి పెడితే... పదిటన్నుల దిగుబడి వస్తోంది. ఖర్చులన్నీ పోను లక్షన్నర వరకు ఆదాయం వస్తోందని రైతు మోహన్‌ కుమారుడు ధరంపాల్‌ చెబుతున్నారు.

సేంద్రీయ పద్ధతిలో పండించిన మిర్చి రుచికరంగానే కాకుండా ఆరోగ్యానికి ఉపయుక్తంగా ఉంటుందని కొనుగోలుదారులు అంటున్నారు. ఉద్యానవన శాఖ నుంచి రాయితీపై ఇస్తున్న పాలిహౌజ్‌ను రైతులు ఉపయోగించుకుని సాగులో లాభాలు గడించాలని అధికారులు చెబుతున్నారు. ఇతర వాణిజ్య పంటలకంటే పాలిహౌజ్‌లో మిర్చి సాగుతో మంచి దిగుబడి, లాభాలు వస్తున్నాయని రైతు మోహన్‌ అంటున్నారు.

ఇదీ చూడండి:బడ్జెట్​ 2021: బొమ్మల పరిశ్రమకు నూతన విధానం!

ABOUT THE AUTHOR

...view details