తెలంగాణ

telangana

స్టాక్​ మార్కెట్లపై ఆర్​బీఐ పిడుగు.. సెన్సెక్స్​ 1300 పాయింట్లు పతనం

By

Published : May 4, 2022, 3:39 PM IST

వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ఆర్​బీఐ చేసిన అనూహ్య ప్రకటన వల్ల స్టాక్​ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్​ 1300 పాయింట్లకుపైగా పతనం కాగా.. నిఫ్టీ 390కిపైగా పాయింట్లు కుప్పకూలింది.

stock market news
stock market news

Stock Market today: స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. వడ్డీ​ రేట్లను పెంచుతున్నట్లు ఆర్​బీఐ ఆకస్మికంగా ప్రకటించడం మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1307 పాయింట్లు కుప్పకూలి 55,669కి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 391 పాయింట్లు పతనమై 16,677వద్ద స్థిరపడింది. వడ్డీ రేట్ల పెంపుతో మదుపర్లంతా చివర్లో అమ్మకాలకే మొగ్గు చూపటం వల్ల మార్కెట్లు ఇంత భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

అపోలో హాస్పిటల్స్​ , హిండాల్కో, అదానీ పోర్ట్స్​, బజాజ్ ఫైనాన్స్​, టైటాన్​ కంపెనీ షేర్లు బుధవారం నాలుగు శాతానికి పైగా నష్టపోయాయి. ఓఎన్​జీసీ, బ్రిటానియా, పవర్​గ్రిడ్ కార్ప్, ఎన్​టీపీసీ షేర్లు లాభపడ్డాయి.

RBI interest rate 2022: ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెపో రేటను 40 బేసిస్​ పాయింట్ల మేర పెంచి.. 4.4శాతంగా నిర్ణయించినట్లు వెల్లడించారు ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని, ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని వివరించారు. రేట్ల పెంపునకు ద్రవ్యపరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు.

RBI News: ద్రవ్యోల్బణం గత మూడు నెలలుగా నిర్దేశిత లక్ష్యం 6శాతం కంటే ఎక్కువగా ఉంది. ఏప్రిల్​లో కూడా ఇది ఎక్కువగానే ఉండే సూచనలు కన్పిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. టోకు ద్రవ్యోల్బణం మార్చిలో 6.9శాతంగా నమోదైందని గుర్తు చేశారు. ఈ కారణంగా వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే నగదు నిల్వల నిష్పత్తిని (CRR) 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతంగా నిర్ణయించినట్లు ఆర్​బీఐ ప్రకటించింది. మే 21 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రూ. 87,000 కోట్ల లిక్విడిటీ రూపంలో తీసుకోనుంది. సీఆర్​ఆర్​ అంటే బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో లిక్విడ్​ క్యాష్​ను మెయింటెన్ చేయాల్సిన శాతం.

ABOUT THE AUTHOR

...view details