తెలంగాణ

telangana

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు.. నిరాశే మిగిల్చిన ఎల్ఐసీ!

By

Published : May 17, 2022, 3:54 PM IST

Updated : May 17, 2022, 6:55 PM IST

Stock Market closing: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ 2 శాతానికి పైగా లాభపడ్డాయి. మార్కెట్లో లిస్ట్ అయిన ఎల్ఐసీ షేరు.. మదుపరులను తీవ్రంగా నిరాశపరిచింది. కాగా, ఎల్ఐసీ షేరు మందగమనంపై ప్రభుత్వం స్పందించింది.

Stock market closing today
Stock market closing today

Stock Market Update: స్టాక్ మార్కెట్లు మంగళవారం దూసుకెళ్లాయి. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో భారీ లాభాలు నమోదు చేశాయి. ఆరంభంలోనే 363 పాయింట్లు ఎగబాకిన బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. చివర్లో మరింత పుంజుకొని 1344 పాయింట్ల లాభంతో 54,318 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్​లో నమోదిత 30 కంపెనీల షేర్లన్నీ లాభాల్లోనే ట్రేడింగ్ ముగించాయి. లోహ రంగ సూచీ 6 శాతానికిపైగా లాభపడింది. ఆటో, ఆర్థిక రంగ షేర్లు సైతం గణనీయంగా లాభాలు గడించాయి. రిలయన్స్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు రాణించాయి.
మరోవైపు, నిఫ్టీ సైతం భారీగా వృద్ధి చెందింది. 417 పాయింట్లు లాభపడి.. 16,260 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీలోని 50 షేర్లలో 48 కంపెనీలు లాభాలు సాధించాయి.

LIC shares listing: అయితే, మంగళవారం మార్కెట్లలో లిస్ట్ అయిన ఎల్ఐసీ షేర్లు మదుపర్లను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఎన్​ఎస్​ఈలో ఎల్​ఐసీ షేరు ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే 8.11 శాతం రాయితీతో రూ.872 వద్ద లిస్టయ్యింది. బీఎస్​ఈలో ఒక్కో షేరు 8.62 శాతం రాయితీతో రూ.867.20 వద్ద లిస్టయింది. ట్రేడింగ్​ ప్రారంభంలో షేరు కాస్త కోలుకున్నట్టు కనిపించినా.. కొద్ది నిమిషాలకే ఊగిసలాటకు గురైంది. అనంతరం ఫ్లాట్​గా ట్రేడింగ్ అయి.. చివరకు 7.75 శాతం నష్టంతో 875.45 వద్ద స్థిరపడింది.

LIC listing losses: స్టాక్‌ మార్కెట్‌లో నెలకొన్న ఊహించని పరిస్థితుల కారణంగానే షేర్లు తక్కువ ధర వద్ద లిస్టయ్యాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మంచి లాభాల కోసం షేర్లను దీర్ఘకాలం అట్టిపెట్టుకోవాలని సూచించింది. "మార్కెట్‌ పరిస్థితుల్ని ఎవరూ అంచనా వేయలేరు. ఒకరోజు కోసం కాకుండా దీర్ఘకాలం కోసం షేర్లను ఉంచుకోవాలని మేం ముందు నుంచీ చెబుతూ వస్తున్నాం. అయితే, రాయితీ ధర వద్ద షేర్లను దక్కించుకున్న పాలసీదారులు, ఉద్యోగులు, రిటైల్‌ మదుపర్లకు మాత్రం కొంత రక్షణ లభించింది" అని 'పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం' కార్యదర్శి తుహిన్‌కాంత పాండే వివరించారు.

మరోవైపు, ఎల్‌ఐసీ ఛైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ మాట్లాడుతూ.. ఎల్‌ఐసీ షేర్లకు రానున్న రోజుల్లో డిమాండ్‌ పెరగనుందన్నారు. కేటాయింపులో షేర్లు దక్కనివారు సెకండరీ మార్కెట్‌లో కొనుగోలుకు ఆసక్తి చూపిస్తారని తెలిపారు. ఫలితంగా షేరు ధర పుంజుకుంటుందని అంచనా వేశారు. దీర్ఘకాలం ఈ స్టాక్‌ మందకొడిగా ఉండడానికి ఎలాంటి కారణాలు లేవని తెలిపారు.

ఐదో అతిపెద్ద కంపెనీగా:ఐపీఓ లిస్టింగ్‌తో ఎల్‌ఐసీ దేశంలోనే ఐదో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్‌ విలువ దాదాపు రూ.5.54లక్షల కోట్లు. మార్కెట్‌ విలువ పరంగా.. హెచ్‌యూఎల్‌ (రూ.5.27లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్‌ (రూ.4.94 లక్షల కోట్లు), ఎస్‌బీఐ (రూ.4.17లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.3.97లక్షల కోట్లు) కంటే ఎల్‌ఐసీ పెద్ద కంపెనీ అని బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. రూ.17.12లక్షల కోట్లతో రిలయన్స్‌ దేశంలోనే అతిపెద్ద కంపెనీగా అగ్ర స్థానంలో ఉండగా.. ఆ తర్వాత టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఉన్నాయి.

ఇదీ చదవండి:

Last Updated : May 17, 2022, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details