తెలంగాణ

telangana

రిలయన్స్ విస్తరణ, భారీగా కొత్త పెట్టుబడులు, వారసులకు బాధ్యతలు

By

Published : Aug 29, 2022, 8:11 PM IST

RELIANCE AGM
ముకేశ్ అంబానీ

RELIANCE AGM 2022 వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. 2027 కల్లా వ్యాపార విలువను రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించింది. కొత్తగా ఎఫ్​ఎంసీజీ రంగంలోకి దిగనున్నట్లు పేర్కొంది. ఐదేళ్లలో రూ.75వేల కోట్ల పెట్టుబడితో పెట్రో కెమికల్స్ రంగాన్ని విస్తరించనున్నట్లు రిలయన్స్ తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించింది. ఇదే సమయంలో తన వ్యాపార సంస్థలను వారసులకు అప్పగించే ప్రక్రియను ముకేశ్ అంబానీ​ మరింత ముందుకు తీసుకెళ్లారు. మరోవైపు 5జీ సేవలను అందించనున్నట్లు ముకేశ్ ప్రకటించారు.

RELIANCE AGM 2022: రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. గత ఏడాది కాలంలో అన్ని రంగాల్లోనూ రాణించిందని ప్రకటించారు. ఏకీకృత ఆదాయం 47 శాతం పెరిగి 7.93 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. రిలయన్స్‌ ఎగుమతులు 75 శాతం ఎగబాకి 2.50 లక్షల కోట్లకు చేరాయన్నారు.

భారత్‌లో రిలయన్స్‌ అతిపెద్ద పన్ను చెల్లింపు సంస్థగా నిలిచిందని, ప్రత్యక్ష, పరోక్ష మార్గాల్లో 1.88 లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. రిలయన్స్‌ కొత్తగా 2.32 లక్షల మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్లు తెలిపారు. ఓటీటీలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపిన ముకేశ్ అంబానీ గత ఏడాది కాలంలో రిలయన్స్ మీడియా సబ్‌స్క్రిప్షన్లు, ప్రకటనల ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించినట్టు తెలిపారు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం వయాకామ్‌ 18 ఐదేళ్ల పాటు ఐపీఎల్‌ ప్రసార హక్కులను దక్కించుకున్నట్లు ముకేశ్ గుర్తుచేశారు. రిలయన్స్‌ చమురు, గ్యాస్‌ వ్యాపారంలో ఆదాయం బిలియన్‌ డాలర్లు దాటినట్లు చెప్పారు. ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ విభాగం వార్షిక ఆదాయం 5 లక్షల కోట్లు దాటినట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో పెట్రో కెమికల్స్ వ్యాపారం విస్తరణకు 75 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ముకేశ్ తెలిపారు.

అటు తన వ్యాపార సంస్థల్లో బాధ్యతలను వారసులకు బదిలీ చేసే క్రమంలో పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిన ముకేశ్.. రిటైల్‌ బిజినెస్‌ను కుమార్తె ఇషా అంబానీకు అప్పగించారు. రిలయన్స్‌ మాతృ సంస్థలో భాగమైన న్యూ ఎనర్జీ వ్యాపారానికి తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీని లీడర్‌గా ప్రకటించారు. ఆ తర్వాత మాట్లాడిన ఇషా రిలయన్స్‌ రిటైల్‌ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించారు. ఆన్‌లైన్‌ గ్రోసరీ విభాగంలో రిలయన్స్‌ రిటైల్‌ దేశంలో నంబర్‌వన్‌గా ఉందన్నారు. 260 పట్టణాల్లో జియో మార్ట్‌ సేవలు అందిస్తోందని రోజుకు 6 లక్షల డెలివరీలు చేస్తున్నామని తెలిపారు. రిటైల్ కస్టమర్లు వాట్సాప్‌లోనే ఆర్డర్‌ చేసేందుకు వీలుగా వాట్సాప్‌ మాతృసంస్థ మెటాతో జట్టుకట్టినట్లు ఇషా అంబానీ ప్రకటించారు.

దీపావళి కానుకగా..
Reliance 5G Network: దీపావళి కానుకగా జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. నాలుగు మెట్రో నగరాలు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నైలో జియో 5జీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. దశలవారీగా 2023 డిసెంబరు నాటికి ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టాలనేది జియో లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5జీ సేవల వివరాలను ముకేశ్ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో జియో 5జీ సాంకేతికత కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు.. ప్రకటించారు. అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లో జియో 5జీ సేవలను ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు.

భారత్‌ను డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మలిచేందుకు కట్టుబడి ఉన్నట్లు ముకేశ్ తెలిపారు. ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల్లోనూ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఆల్ట్రా హైస్పీడ్ జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరిట జియో 5జీ ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తామని ప్రకటించారు. గూగుల్‌తో కలిసి 5జీ ఫోన్‌ను తేనున్నట్లు తెలిపారు. అందుబాటు ధరల్లోనే అందిస్తామని.. 5జీ సొల్యూషన్స్‌ కోసం క్వాల్‌కామ్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ముకేశ్ వివరించారు.

క్లౌడ్​ పీసీ సర్వీస్​..
మరోవైపు, క్లౌడ్ ఆధారిత పీసీ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్ అధినేత వెల్లడించారు. ప్రస్తుతం పీసీ, ల్యాప్‌టాప్‌ను ప్రతిసారి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి వస్తుందన్న అంబానీ.. ఇక ఆ అవసరమేలేకుండా క్లౌడ్ పీసీని తెస్తున్నట్లు తెలిపారు. తద్వారా అప్‌గ్రేడ్ చేసే ఖర్చు ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఎంత వాడుకుంటే అంతే చెల్లించవచ్చని చెప్పారు. రిలయన్స్ కంపెనీలో వినియోగిస్తున్న పీసీల స్థానంలో జియో క్లౌడ్‌ పీసీలను అందుబాటులోకి తెస్తున్నట్లు అంబానీ వివరించారు.

ఇవీ చదవండి:రైలు టికెట్లు రద్దు చేసుకున్నా జీఎస్టీ భరించాల్సిందే, వారికి మినహాయింపు

వారసులకు పెద్దపీట, ఈశాకు రిలయన్స్ రిటైల్, అనంత్​కు న్యూ ఎనర్జీ

ABOUT THE AUTHOR

...view details