తెలంగాణ

telangana

2024లోనూ కొనసాగనున్న పసిడి జోరు! 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరే అవకాశం!

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 1:48 PM IST

Gold Rate Forecast 2024 In Telugu : దేశంలో బంగారం ధరలు గత మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. 2024లోనూ ఈ జోరు కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. బహుశా 10 గ్రాముల మేలిమి బంగారం రూ.70,000కు చేరినా ఆశ్చర్యపోనవసం లేదని చెబుతున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.

gold Price forecast 2024
gold rate forecast 2024

Gold Rate Forecast 2024 :దేశంలో గత 3 ఏళ్లుగా రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధరల జోరు, 2024లోనూ కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది మన దేశంతో పాటు దాదాపు 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు ఆర్థిక మందగమనము వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరల పెరుగుదల 2024లోనూ కొనసాగవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర సుమారుగా రూ.65,000, కిలో వెండి ధర రూ.75,000 స్థాయిల్లో ఉన్నాయి. అయితే 2024 సంవత్సరంలో పసిడి ధర రూ.70,000కు, వెండి ధర రూ.90,000కు పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధరలు పెరుగుతున్నాయ్​!
గత దశాబ్ద కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, 2013 ఏప్రిల్‌ నుంచి 2019 జూన్‌ వరకు అంతర్జాతీయంగా పసిడి ధరలు దాదాపుగా తక్కువ స్థాయుల్లోనే కొనసాగాయి. అప్పట్లో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర 1200-1350 డాలర్ల స్థాయిలోనే ఉండేది.కానీ 2020లో కొవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు, మదుపరులు సురక్షిత పెట్టుబడి అయిన బంగారంలో ఇన్వెస్ట్ చేశారు. దీనితో ఔన్స్ పసిడి సగటు ధర 1775 డాలర్లకు పెరిగింది. 2019తో పోలిస్తే, ఈ ధర ఏకంగా 37 శాతం అధికం కావడం గమనార్హం. 2021లో బంగారం సగటు ధర 1780 డాలర్లకు చేరగా, 2022లో మరికొంత అధికమై 1804 డాలర్లకు పెరిగింది. 2023 డిసెంబర్​ 3న రికార్డు స్థాయిలో 2152 డాలర్లకు చేరిన పుత్తడి, ప్రస్తుతం 2075 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 2024లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగి ఔన్స్ బంగారం ధర 2150-2300 డాలర్ల మధ్య కదలాడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భౌతిక బంగారం పరిస్థితి ఏమిటి?
అంతర్జాతీయంగా ‘పెట్టుబడుల రూపంలో’ వచ్చే మొత్తాలే బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి భారత్​, చైనాలు మాత్రమే భౌతిక రూపంలో ఈ విలువైన లోహాన్ని ఎక్కువగా కొంటుంటాయి. అంతర్జాతీయంగా చూస్తే 2018లో 1.6 కోట్ల ఔన్సులు, 2019లో 1.7 కోట్ల ఔన్సుల బంగారం లోహ రూపంలో అమ్ముడైంది. అయితే 2020 కొవిడ్‌ సంక్షోభం తరువాత లోహ రూపంలోని బంగారం రెట్టింపు స్థాయిలో అమ్ముడైంది. అదే దాదాపుగా 4 కోట్ల ఔన్సులకు అమ్మకాలు పెరిగాయి. ఫలితంగా బంగారం ధరలు అమాంతం పెరిగాయి. 2021 నుంచి ఇప్పటివరకు ఏటా 2.4 -2.7 కోట్ల ఔన్సుల మేర బంగారం కొనుగోళ్లు జరిగాయని సమాచారం. వచ్చే ఏడాది కూడా ఇది మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కేంద్ర బ్యాంకులు కూడా
వివిధ దేశాలకు చెందిన కేంద్రీయ బ్యాంకులు భవిష్యత్ అవసరాల కోసం ఫారెక్స్‌ (విదేశీ మారకపు) నిల్వలను వివిధ రూపాల్లో దాచుకుంటాయి. అందులో బంగారం వాటా అధికంగా ఉంటుంది. 2009 నుంచి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరవాత కేంద్రీయ బ్యాంకులన్నీ కలిపి చేసే వార్షిక సగటు బంగారం కొనుగోళ్లు 1 కోటి ఔన్సులకు తగ్గడం లేదు. వచ్చే దశాబ్దంలో ఇది మరింత ఎక్కువ కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

డిమాండ్ పెంచే అంశాలు ఇవే!
పైన చెప్పనవన్నీ బంగారానికి మరింత డిమాండ్​ను పెంచే అంశాలే. వాస్తవానికి బంగారం ధర మరీ అధికంగా ఉన్నప్పుడు కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు తక్కువగా చేస్తుంటాయి. ధర అందుబాటులో ఉన్నప్పుడే ఇవి పసిడిని ఎక్కువగా కొని, తమ నిల్వలు పెంచుకుంటాయి. అందులో భాగంగానే 2017, 2018లలో 1.7 కోట్ల ఔన్సుల బంగారాన్ని కొన్న సెంట్రల్‌ బ్యాంకులు, 2020లో మాత్రం అందులో సగం కూడా సమీకరించలేదు. దీనికి ప్రధాన కారణం బంగారం ధరలు పెరగడమే.

సప్లై పరిస్థితి ఏమిటి?
గనుల నుంచి బంగారం తవ్వకం గతంలో తగ్గింది. కానీ గత మూడేళ్లుగా పసిడి తవ్వకాలు స్థిరీకరణ దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది గనుల నుంచి 8.75 కోట్ల ఔన్సుల మేర బంగారం లభించింది. దీనిని శుద్ధి చేశాక 3.48 కోట్ల ఔన్సుల మేర సప్లై చేయవచ్చని అంచనా. మరో రెండు, మూడేళ్ల తరవాత గనుల తవ్వకాలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి. పైగా ఇప్పటికే పాత, విరిగిన ఆభరణాలను మార్చుకుని కొత్త బంగారు నగలు కొనుక్కోవడం పెరుగుతోంది. నేటి కాలంలో ఎలక్ట్రానిక్స్‌, రసాయనాలు, పళ్ల సంబంధిత అవసరాలకు కూడా పసిడిని వినియోగిస్తున్నారు. అందువల్ల ధరలు మరీ అధికమైతే, ఆభరణాల డిమాండ్​పై ప్రభావం పడుతుందేమో కానీ, పసిడి పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం పడదని నిపుణులు భావిస్తున్నారు.

ధరలు - అంచనాలు

"2023 సంవత్సరం ప్రారంభంలో గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ.5,425 ఉండగా, ఇప్పుడు రూ.6,540కు చేరింది. అంటే ఒక్కో గ్రాము ధర రూ.1,100 వరకు పెరిగింది. 2024లో అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 2300 డాలర్లకు పెరిగితే, దేశీయంగా గ్రాము పసిడి ధర రూ.7,100కు చేరే అవకాశం ఉంది."
- బుశెట్టి రామ్మోహనరావు, ఆలిండియా జెమ్​ అండ్ జువెలరీ ట్రేడ్ ఫెడరేషన్​ సభ్యులు

"వచ్చే ఏడాదిలో గ్రాము మేలిమి బంగారం ధర రూ.7000కు చేరవచ్చు. కిలో వెండి ధర రూ.90,000కు చేరవచ్చని అంచనా. 2024 ఫిబ్రవరి తరవాత వివాహాది శుభ ముహూర్తాలు లేవు. అందువల్ల ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి కొంత తగ్గవచ్చు. అయితే అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని అనుసరించే బంగారం ధరలు ప్రభావితం అవుతుంటాయి."
- చందా శ్రీనివాసరావు, ఇండియన్‌ బులియన్‌ జువెలరీ అసోసియేషన్‌ తెలంగాణా ప్రెసిడెంట్‌

వజ్రాల పరిస్థితి ఏమిటి?
2024లో వజ్రాల పరిస్థితి కాస్త భిన్నంగా ఉండవచ్చు. అసలైన వజ్రాలతో పోలిస్తే, ల్యాబ్‌ గ్రోన్‌ డైమండ్స్‌ ధరలు సగం మేరే ఉండవచ్చు. అయితే రెండిటికీ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అవసరాలకు అనుగుణంగా, సరిచూసుకుని వజ్రాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

బంగారం కొంటున్నారా? బిల్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే!

Gold Buying Tips : బంగారు ఆభరణాలు కొనాలా?.. ఈ విషయాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details