తెలంగాణ

telangana

ఈ-బైక్స్​లో మంటలు.. ఆ స్కూటర్లన్నింటినీ వెనక్కి పిలిపిస్తున్న ఓలా

By

Published : Apr 24, 2022, 11:09 AM IST

ola ebike fire accident
ఈ-బైక్స్​లో మంటలు.. ఆ స్కూటర్లన్నింటినీ వెనక్కి పిలిపిస్తున్న ఓలా ()

Ola Recall: ఈ-బైక్స్ తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో విద్యుత్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,441 స్కూటర్లను వెనక్కి పిలిపించి, పూర్తిగా తనిఖీ చేశాకే కస్టమర్లకు అందించనున్నట్లు ప్రకటించింది.

Ola Recall: దేశంలో ఇప్పటికే విక్రయించిన విద్యుత్ స్కూటర్లలో 1,441 బైక్స్​ను రీకాల్ చేస్తున్నట్లు ఈ-బైక్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఈ-బైక్స్​లో మంటలు చెలరేగి, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించాక.. తిరిగి యజమానులకు అప్పగిస్తామని తెలిపింది.

"మార్చి 26న పుణెలో ఓలా ఈ-బైక్​లో మంటలు చెలరేగిన ఘటనపై దర్యాప్తు సాగుతోంది. అయితే.. అది ఆ ఒక్క స్కూటర్​లో లోపం కారణంగానే జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. అయినా ముందు జాగ్రత్తగా ఆ బ్యాచ్​లో తయారైన 1,441 వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నాం. బ్యాటరీ వ్యవస్థ, థర్మల్ వ్యవస్థ, ఇతర భద్రతాపరమైన వ్యవస్థలన్నింటినీ మా సర్వీస్ ఇంజినీర్లు తనిఖీ చేస్తారు" అని ఓ ప్రకటనలో పేర్కొంది ఓలా ఎలక్ట్రిక్. తమ స్కూటర్లలోని బ్యాటరీ వ్యవస్థ.. భారత ప్రభుత్వం నిర్దేశించిన ఏఐఎస్ 156, ఐరోపా నిర్దేశించిన ఈసీఈ 136 నాణ్యతా ప్రమాణాలకు లోబడే ఉందని స్పష్టం చేసింది.

వరుస ప్రమాదాలు.. వేలాది యూనిట్లు రీకాల్: పెట్రోల్​ ధరల పెరుగుదలతో దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అయితే.. ఈ-బైక్స్​లో మంటలు చెలరేగి, అనేక ప్రమాదాలు జరగడం ఇటీవల చర్చనీయాంశమైంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుని, తయారీ సంస్థల తప్పు ఉంటే జరిమానా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కమిటీ ఏర్పాటు చేసింది. అటు.. తయారీ సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. ఒకినావా ఆటోటెక్ ఇప్పటికే 3వేల స్కూటర్లు రీకాల్ చేసింది. ప్యూర్​ఈవీ అదే తరహాలో 2వేల ఈ-బైక్స్​ను వెనక్కు పిలిపించింది.

రెండేళ్లలో ఓలా సెల్ఫ్​ డ్రైవ్ కార్​: మరోవైపు.. స్వయం చోదక కార్ల తయారీపై ఓలా ప్రత్యేక దృష్టిపెట్టింది. రెండేళ్లలోనే సెల్ఫ్​ డ్రైవింగ్ కారును గ్లోబల్ మార్కెట్​లో లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించారు ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్. ఇది చౌక ధరకే అందుబాటులో ఉంటుందని తమిళనాడు కృష్ణగిరి జిల్లా పోచంపల్లిలోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో చెప్పారు. "స్వయం చోదక వాహనాన్ని ఆరు నెలల క్రితమే ఓలా పరీక్షించడం ప్రారంభించింది. 2023 చివర్లో లేదా 2024 ఆరంభంలో అటానమస్ కారును తీసుకొస్తాం. ఎక్కువ మంది ప్రజలు కొనుక్కోగలిగేలా రూ.10లక్షలకే ఈ కారును విక్రయిస్తాం." అని వివరించారు భవీశ్ అగర్వాల్.

ABOUT THE AUTHOR

...view details