తెలంగాణ

telangana

ఏడాది కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం.. నవంబరులో IIP వృద్ధి 7.1 శాతం

By

Published : Jan 13, 2023, 6:49 AM IST

డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠమైన 5.72 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరల తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. మరోవైపు, దేశీయ పారిశ్రామికోత్పత్తి 2022 నవంబరులో 7.1 శాతం వృద్ధి నమోదు చేసింది.

retail inflation rate in india
రిటైల్‌ ద్రవ్యోల్బణం

డిసెంబరులో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ఠమైన 5.72 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) వెల్లడించింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022 నవంబరులో 5.88 శాతం కాగా, 2021 డిసెంబరులో 5.66 శాతంగా నమోదైంది. 2022 జనవరి నుంచి అక్టోబరు వరకు రిటైల్‌ ద్రవ్యోల్బణం, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విధించుకున్న గరిష్ఠ లక్ష్యమైన 6 శాతం ఎగువనే నమోదైంది. గత నవంబరులో మళ్లీ 6 శాతం లోపునకు దిగివచ్చింది. డిసెంబరులో మరింత తగ్గింది.

  • ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం నవంబరులో 4.67 శాతం కాగా, డిసెంబరులో 4.19 శాతానికి తగ్గింది. 2021 డిసెంబరులో ఇది 4.05 శాతంగా ఉంది.
  • కూరగాయల ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 15 శాతం తగ్గింది. పండ్ల ధరలు 2 శాతం పెరిగాయి. నూనెలు, కొవ్వులు, చక్కెర, మిఠాయిల విభాగంలో ధరలు పెద్దగా మారలేదు.
  • సుగంధ ద్రవ్యాలు 20%, చిరు ధాన్యాలు 14% ప్రియమయ్యాయి. ఇంధనం-విద్యుత్‌ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 11% పెరిగింది.
  • భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరా అంతరాయాలతో 2022 జనవరి నుంచి రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే నమోదు కావడంతో, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022 మే నుంచి స్వల్పకాలిక రుణ రేటు (రెపో)ను 2.25% పెంచింది. దేశీయ విపణిలో ధరలు పెరగకుండా చూసేందుకు, కొన్ని కమొడిటీల ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సత్ఫలితాలనిచ్చింది.

ఐఐపీ నృద్ధి..
దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 2022 నవంబరులో 7.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది 5 నెలల గరిష్ఠ స్థాయి. 2021 నవంబరులో ఐఐపీ 1 శాతమే పెరిగింది. 2022 అక్టోబరులో ఇది 4 శాతం క్షీణించడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తయారీ రంగ ఉత్పత్తి గత నవంబరులో 6.1 శాతం వృద్ధి చెందింది. గనుల రంగ ఉత్పత్తి 9.7 శాతం, విద్యుదుత్పత్తి రంగం 12.7 శాతం చొప్పున పెరిగాయి. భారీ యంత్ర పరికరాల విభాగం గణనీయంగా 20.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.

మన్నికైన వినిమయ వస్తువులు, మన్నికేతర వినిమయ వస్తువుల విభాగాల్లో వరుసగా 5.1 శాతం, 8.9 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. 2021 నవంబరులో ఈ 2 రంగాల్లోనూ క్షీణత నమోదైంది. మౌలిక/నిర్మాణ రంగ వస్తువుల విభాగంలో 12.8% వృద్ధి నమోదైంది. ప్రాథమిక వస్తువులు, ఇంటర్మీడియేట్‌ వస్తువుల విభాగాల ఉత్పత్తి వరుసగా 4.7 శాతం, 3 శాతం పెరిగాయి.

ABOUT THE AUTHOR

...view details