తెలంగాణ

telangana

మళ్లీ పెరగనున్న సిమెంట్​ ధరలు.. కారణం అదేనా?

By

Published : Apr 20, 2022, 9:54 PM IST

Cement price per bag: దేశీయంగా డిమాండ్​ పెరగటం, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం కారణంగా సిమెంటు ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది రోజుల్లోనే బస్తాకు మరో రూ.25-50 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది ప్రముఖ రేటింగ్స్​ సంస్థ క్రిసిల్​. అందుకు పలు కారణాలను వివరించింది.

Cement price per bag
సిమెంట్​ ధరలు

Cement price per bag: దేశవ్యాప్తంగా నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడం వల్ల సరఫరా తగ్గి సిమెంటు, స్టీలు ధరలు భారీగా ఎగబాకాయి. సరిగ్గా ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. యుద్ధం ఆరంభమైన తర్వాత బొగ్గు, పెట్రోలియం కోక్‌ ధరలు భారీగా పెరిగాయి. ఈ రెండూ సిమెంటు తయారీలో కీలక ముడిపదార్థాలు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. పెట్‌కోక్‌ ధరలు గత ఆరు నెలల్లో 30-50 శాతం పెరిగాయి. ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా గత ఏడాది వ్యవధిలో బస్తా సిమెంటు ధర రూ.390కు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధర మరో రూ.25-50 పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

పెట్రో ధరల పెరుగుదలా ఓ కారణం:బొగ్గు, పెట్‌కోక్‌తో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అటు అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశీయంగానూ ఎగబాకుతున్నాయి. ఫలితంగా సిమెంటు తయారీ వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఇంధన ధరలు పెరగడం వల్ల సిమెంట్‌ ముడి పదార్థాల శుద్ధి, ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీ, సరఫరా, ప్రయాణ ఖర్చులన్నీ పెరిగిపోతాయి. దీంతో ఈ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపే అవకాశం ఉంటుంది.

ముడిపదార్థాల ధరలు ఇలా:యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ సగటు ధర 21 శాతం పెరిగి 115 డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ధరలు 79 శాతం పెరగడం గమనార్హం. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో మార్చితో ముగిసిన త్రైమాసికంలో పెట్‌ కోక్‌ ధర 43 శాతం పెరిగింది. అమెరికా పెట్‌కోక్‌ గత ఏడాది ఏకంగా 96 శాతం ఎగబాకింది. దీంతో దేశీయ సంస్థలు మార్చిలో పెట్‌కోక్‌ ధరను 26 శాతం, ఏప్రిల్‌లో 21 శాతం పెంచాయి. సముద్ర రవాణా ఖర్చులు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందుల వల్ల పెట్‌కోక్‌ దిగుమతి వ్యయం ఒక్కో టన్నుపై 130 డాలర్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

వినియోగం 5-7 శాతం పెరగొచ్చు:ఈ ఆర్థిక సంవత్సరంలో సిమెంట్‌ వినియోగం 5-7 శాతం పెరిగే అవకాశం ఉందని క్రిసిల్‌ అంచనా వేసింది. టైర్‌-1, టైర్‌-2 పట్టణాల్లో అందుబాటు ధరలో ఉండే ఇళ్లకు డిమాండ్‌ పెరగడం, మౌలిక వసతుల కల్పన అందుకు దోహదం చేయనున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో డిమాండ్‌ 20 శాతం పుంజుకుందని తెలిపింది. కానీ, ద్వితీయార్ధంలో అది 7 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. ఇసుక, కార్మికుల కొరతతో పాటు ఇంధన, విద్యుత్తు, ప్రయాణ ఖర్చులు పెరగడం సవాళ్లుగా నిలిచాయని పేర్కొంది.

ఇదీ చూడండి:నెట్​ఫ్లిక్స్ షాక్.. పాస్​వర్డ్ షేర్​ చేస్తే ఛార్జ్! వీడియోలలో యాడ్స్!!

'ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసం.. వ్యవస్థల స్థిరత్వానికి పెను ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details