తెలంగాణ

telangana

ప్రయాణికులకు షాక్.. 'టికెట్ రేట్లు 15% పెంపు!'.. ఏటీఎఫ్​ బాదుడే కారణం!

By

Published : Jun 16, 2022, 2:16 PM IST

ATF PRICE HIKE: విమాన ఇంధన ధరలు 16 శాతం మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది. ఈ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు.. టికెట్ల ధరలను పెంచాలని కోరుతున్నాయి.

ATF-PRICE-HIKE
ATF-PRICE-HIKE

ATF PRICE HIKE: విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లలోనూ 16 శాతం మేర రేట్లు పెరిగాయి. దిల్లీలో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర కిలోలీటర్​కు రూ.19,757.13 పెరిగింది. ఫలితంగా ఇంధనం కిలోలీటర్ ధర రూ.1.41 లక్షలు దాటింది. ప్రతి నెలా 1, 16వ తేదీల్లో ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి చమురు సంస్థలు. జూన్ 1న ఏటీఎఫ్ రేట్లను 1.3 శాతం తగ్గించాయి. అంతకుముందు వరుసగా 10 సార్లు రేట్లు పెరిగాయి. తాజా పెంపుతో ఏటీఎఫ్ ధర జీవితకాల గరిష్ఠానికి చేరింది.

ATF price increase India: ఏటీఎఫ్ ధరలు విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. ఎయిర్​లైన్ల ఆపరేటింగ్ వ్యయాల్లో ఏటీఎఫ్ ఖర్చులే 40 శాతం వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పైస్​జెట్ సంస్థ విమాన టికెట్ల ధరలు పెంచాలని యోచిస్తోంది. దేశీయ విమాన టికెట్ల ధరలు తక్షణమే పెంచడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని స్పైస్​జెట్ ఛైర్మన్, ఎండీ అజయ్ సింగ్ తెలిపారు. 10 నుంచి 15 శాతం రేట్లు పెంచితే నిర్వహణ సాఫీగా సాగుతుందని అన్నారు. ఏటీఎఫ్ ధరలు గణనీయంగా పెరగడం, రూపాయి విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడం వంటి కారణాల వల్ల.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందన్నారు. '2021 జూన్ తర్వాత ఏటీఎఫ్ ధరలు 120 శాతం పెరిగాయి. ఏటీఎఫ్​పై ప్రపంచంలోనే అత్యధిక పన్నులు మన దేశంలోనే ఉన్నాయి. ఇలాగే కొనసాగితే నిర్వహణ సాధ్యం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసరంగా చర్యలు తీసుకొని పన్నులు తగ్గించాలి' అని అజయ్ సింగ్ కోరారు.

కరోనా విరామం తర్వాత 2020లో విమాన సర్వీసులను పునఃప్రారంభించాక.. టికెట్ల రేట్లపై గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను కేంద్రం విధించింది. 40 నిమిషాల కన్నా తక్కువ ప్రయాణానికి కనిష్ఠంగా రూ.2,900, గరిష్ఠంగా రూ.8,800 వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఎయిర్​లైన్లు నష్టాల్లో కూరుకుపోకుండా, ప్రయాణికులపై ఛార్జీల భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details