తెలంగాణ

telangana

అమెరికాకు నాట్కో ఫార్మా కేన్సర్‌ ఔషధం

By

Published : May 23, 2021, 6:52 AM IST

కేన్సర్​ వ్యాధులను అదుపు చేసే జనరిక్​ ఔషధం 'లెనలిడోమైడ్' కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తుది అనుమతి ఇచ్చింది. 2022 మార్చి నుంచి అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం ఉంది.

Natco Pharma
నాట్కో ఫార్మా

కొన్ని రకాల కేన్సర్‌ వ్యాధులను అదుపు చేసేందుకు వినియోగించే లెనలిడోమైడ్‌ జనరిక్‌ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. 5ఎంజీ, 10ఎంజీ, 15ఎంజీ, 25ఎంజీ డోసుల్లో ఈ ఔషధాన్ని విక్రయించేందుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తుది అనుమతి ఇచ్చింది. దీనికి మూడేళ్ల క్రితమే తాత్కాలిక అనుమతి రాగా, తుది అనుమతి కోసం ఎదురుచూస్తుంది.

లెనలిడోమైడ్‌ ఔషధంపై పేటెంట్‌ హక్కులు అమెరికాకు చెందిన సెల్‌జీన్‌ (బ్రిస్టల్‌-మేర్స్‌ స్క్విబ్‌కు అనుబంధ సంస్థ) అనే కంపెనీకి ఉన్నాయి. దీన్ని 'రెవ్‌లీమిడ్‌' బ్రాండు పేరుతో ఆ సంస్థ విక్రయిస్తోంది. సెల్‌జీన్‌తో పేటెంట్‌ వివాదాన్ని (పారా-4 లిటిగేషన్‌) నాట్కో ఫార్మా గతంలోనే పరిష్కరించుకుంది. దీని ప్రకారం 2022 మార్చి నుంచి అమెరికాలో లెనలిడోమైడ్‌ జనరిక్‌ ఔషధాన్ని విక్రయించవచ్చు. దీనికి సంబంధించి 6 నెలల ప్రత్యేక మార్కెటింగ్‌ హక్కులు కూడా నాట్కో ఫార్మాకు ఉన్నాయి. అంటే ఆరు నెలల పాటు సెల్‌జీన్‌, నాట్కో ఫార్మా మినహా మరొక కంపెనీ అమెరికాలో ఈ ఔషధాన్ని విక్రయించడానికి వీల్లేదు.

ఈ నేపథ్యంలో తన మార్కెటింగ్‌ భాగస్వామి అయిన ఆరో ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (తెవా ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ) ద్వారా అమెరికాలో విక్రయాలు చేపట్టేందుకు నాట్కో ఫార్మా సిద్ధమవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇదే ఔషధాన్ని కెనడాలోనూ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ఇంతటి ప్రాధాన్యం


ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వార్షిక విక్రయాలు సాధిస్తున్న ఔషధాల్లో లెనలిడోమైడ్‌ ఒకటి. 2020లో 12 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.87,000 కోట్లు) అమ్మకాలు నమోదు చేసి టాప్‌-10 ఔషధాల్లో మూడో స్థానంలో నిలిచింది. దీని ప్రకారం చూస్తే.. నాట్కో ఫార్మాకు ఇది పెద్ద అవకాశం అని స్పష్టమవుతుంది. మల్టిపుల్‌ మైలోమా, మ్యాంటిల్‌ సెల్‌ లింఫోమా, మైలోడిస్పాస్టిక్‌ సిండ్రోమ్‌ అనే కేన్సర్‌ వ్యాధుల చికిత్సలో లెనలిడోమైడ్‌ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.

ప్రపంచ విపణిలో ఔషధాలు

ఎవరోలిమస్‌ ఔషధానికీ పచ్చజెండా


'ఎవరోలిమస్‌' అనే మరొక ఔషధానికీ నాట్కో ఫార్మా యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి సంపాదించింది. దీన్ని వెంటనే అక్కడ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తన మార్కెటింగ్‌ భాగస్వామి అయిన బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాసూటికల్స్‌తో కలిసి మూడు రకాల డోసుల్లో ఈ ఔషధాన్ని విక్రయించవచ్చు. మూత్రపిండాల మార్పిడి, కాలేయ మార్పిడి చికిత్సలు చేసిన రోగులకు 'ఆర్గాన్‌ రిజెక్షన్‌' సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఎవరోలిమస్‌ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.

నొవార్టిస్‌ కార్పొరేషన్‌కు చెందిన జోర్‌ట్రెస్‌ అనే బ్రాండుకు ఇది జనరిక్‌ ఔషధం. యూఎస్‌ మార్కెట్లో గత ఏడాది కాలంలో దాదాపు 162 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1180 కోట్లు) అమ్మకాలను ఈ ఔషధం నమోదు చేసింది.

ఇదీ చదవండి :నేడు కేంద్ర విద్యాశాఖ కీలక సమావేశం

ABOUT THE AUTHOR

...view details