తెలంగాణ

telangana

కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించేందుకు నేడు దిల్లీకి షర్మిల

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 6:51 AM IST

Updated : Jan 3, 2024, 7:03 AM IST

ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్​ అధిష్టానాన్ని కలిసేందుకు ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. దిల్లీ వెళ్లే ముందు సోదరుడు జగన్‌ను ఆమె కలవనున్నారు.

YS_Sharmila_Delhi_Tour
YS_Sharmila_Delhi_Tour

కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చించేందుకు నేడు దిల్లీకి షర్మిల

YS Sharmila Delhi Tour: ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ సోదరి వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకు దిల్లీ వెళ్లే ముందు సోదరుడు జగన్‌ను ఆమె కలవనుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

కొన్నిరోజులుగా కథనాలు వస్తున్న తరుణంలో స్వయంగా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు షర్మిల ప్రకటించి అందరి ఊహగానాలను నిజం చేశారు. కాంగ్రెస్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్‌ చేరే ప్రక్రియను పూర్తి చేసేందుకే బుధవారం దిల్లీకి వెళ్తున్నట్లు తెలిపారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరితో కలిసి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద తన తల్లి విజయమ్మతో కలిసి మంగళవారం నివాళులర్పించారు.

కాంగ్రెస్​లో చేరడం ఖాయం - స్పష్టం చేసిన షర్మిల

అనంతరం మాట్లాడిన షర్మిల కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు దిల్లీలో ఆ పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తానని చెప్పారు. ఇడుపులపాయ వేదికగానే ఆమె తన రాజకీయ ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విస్పష్ట ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వచ్చినా ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించని షర్మిల తండ్రి సమాధి వద్ద నేరుగా మీడియా ముందు ప్రకటించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తాను మద్దతుగా నిలిచానని పేర్కొన్నారు. కేసీఆర్ అరాచక పాలన అంత మొందించడానికి తాను కృషి చేశానన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ప్రధాన కారణం తాము తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్లనేనని చెప్పారు. తెలంగాణలో తాను చేసిన త్యాగానికి కాంగ్రెస్ అధిష్టానం కృతజ్ఞతగా తనను పార్టీలోకి ఆహ్వానించిందన్న షర్మిల బుధవారం దిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశంలో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనేనన్న షర్మిల ఆ పార్టీని బలపరచడానికి వెంట నడవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా ఈ సాయంత్రం 4 గంటలకు సోదరుడు జగన్‌ను కలిసేందుకు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల వెళ్లనున్నారు. ప్రస్తుతం ఇడుపులపాయలో తల్లి విజయమ్మతో కలిసి బసచేసిన షర్మిల ఈ మధ్యాహ్నం కడప విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. సోదరుడు జగన్‌కు వివాహ ఆహ్వాన పత్రిక అందించిన తర్వాత అక్కడి నుంచి దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేసిన షర్మిల అధిష్టానంతో కలిసేందుకు దిల్లీ వెళ్లడానికి ముందు జగన్ కలవనుండటం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో మేం పోటీ చేయనందువల్లే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచింది : వైఎస్​ షర్మిల

Last Updated : Jan 3, 2024, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details