తెలంగాణ

telangana

వాడీవేడిగా అఖిలపక్ష భేటీ- ధరల పెరుగుదల, మణిపుర్​ హింసపై చర్చకు విపక్షాలు డిమాండ్

By PTI

Published : Dec 2, 2023, 2:09 PM IST

Updated : Dec 2, 2023, 2:34 PM IST

Winter Session All Party Meeting : కేంద్రమంత్రి రాజ్​నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. దేశంలో ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపుర్​లో హింస వంటి అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా.. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లోద్ జోషి తెలిపారు.

Winter Session All Party Meeting
Winter Session All Party Meeting

Winter Session All Party Meeting :డిసెంబరు 4న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం వాడీవేడిగా జరిగింది. ఈ సందర్భంగా మూడు క్రిమినల్ చట్టాలకు ఆంగ్ల నామకరణం చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. అదే సమయంలో ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, మణిపుర్​లో హింస వంటి అంశాలపై పార్లమెంట్​లో చర్చ జరపాలని పట్టుబట్టారు.

పార్లమెంట్​లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లోద్ జోషి తెలిపారు. నిర్మాణాత్మక చర్చలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. సభ సజావుగా జరిగేందుకు విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. విపక్షాల సూచనలను ప్రభుత్వం సానుకూలంగా తీసుకుంటుందని జోషి వివరించారు. పార్లమెంట్​లో చర్చలు జరిగేలా విపక్షాలు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 19 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల పరిశీలనలో ఉన్నాయని జోషి తెలిపారు.

'పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమై.. డిసెంబర్ 22న ముగుస్తాయి. ఈ 19 రోజుల వ్యవధిలో 15 రోజులపాటు పార్లమెంట్ సభా సమావేశాలు జరుగుతాయి. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో 23 పార్టీల తరఫున 30 మంది హాజరయ్యారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది.' అని ప్రహ్లోద్ జోషి తెలిపారు.

మరో రెండు రోజుల్లో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లోద్ జోషి, పీయూష్ గోయల్​, కాంగ్రెస్ నేతలు జైరాం రమేశ్​, గౌరవ్ గొగొయ్​, ప్రమోద్ తివారీ పాల్గొన్నారు. అలాగే టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ, ఎన్​సీపీ నేత పౌజియా ఖాన్​ తదితరులు హాజరయ్యారు.

మణిపుర్, ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలను అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు లేవనెత్తాయని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన వారి సభ్యత్వాన్ని ఏ కమిటీ కూడా తీసివేయకూడదని కాంగ్రెస్ విశ్వసిస్తోందని.. ఈ అంశంపై చర్చ జరగాలని అన్నారు.

స్పీకర్​కు లేఖ..
ప్రశ్నకు నోటు కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫార్సుపై కాంగ్రెస్​ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి.. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాకు శనివారం లేఖ రాశారు. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ, ఎథిక్స్ కమిటీకి అధికారాలను ఉపయోగించడంలో స్పష్టమైన హద్దులు లేవని లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నకు నోటు కేసులో చిక్కుకున్న ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్​సభ ఎథిక్స్ కమిటీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సోమవారం.. సభలో నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరి లేఖ రాయడం చర్చనీయాంశమైంది.

Last Updated :Dec 2, 2023, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details