తెలంగాణ

telangana

రాహుల్ 'చైనా-పాకిస్థాన్' వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే?

By

Published : Feb 3, 2022, 12:51 PM IST

Rahul gandhi news: ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థ విధానాల వల్లే పాకిస్థాన్​-చైనా కలిశాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. వీటిని తాము సమర్థించలేమని పేర్కొంది. అంతేగాక, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని చెప్పింది.

rahul-gandh, రాహుల్​ గాంధీ
రాహుల్ 'చైనా-పాకిస్థాన్' వ్యాఖ్యలపై అమెరికా ఏమందంటే?

US reaction on rahul comments: భారత విదేశాంగ విధానంపై కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ తెలిపారు.

పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘చైనా, పాకిస్థాన్‌ చేతులు కలపకుండా వేర్వేరు ఉంచాలన్నది భారత్‌ ఏకైక అతిపెద్ద వ్యూహం. అయితే, మీరు(మోదీని ఉద్దేశిస్తూ) ఆ రెండు దేశాలూ కలిసేలా చేశారు. ఇదే మీరు చేసిన అతిపెద్ద నేరం’’ అంటూ రాహుల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

rahul china pakisthan comments

అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘పాకిస్థాన్‌, పీఆర్‌సీ (పీపుల్స్‌ రిపబ్లిక్ ఆఫ్‌ చైనా) మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నా. అయితే ఆ వ్యాఖ్యలను (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) మేం కచ్చితంగా సమర్థించలేం’’ అని సమాధానమిచ్చారు. అంతేగాక, పాకిస్థాన్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఇస్లామాబాద్‌తో తమకు కీలకమైన బంధం ఉందని నెడ్‌ ప్రైస్‌ చెప్పడం గమనార్హం.

rahul parliament speech

పార్లమెంట్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 'గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథినీ ఎందుకు తీసుకురాలేకపోయారో ఆత్మపరిశీలన చేసుకోండి. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ నేడు ఒంటరిగా మిగిలిపోయింది. బాహ్యశక్తుల నుంచి దేశానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది' అని అన్నారు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

రాహుల్​కు స్పీకర్​ పాఠాలు..

లోకసభలో రాహుల్ ప్రసంగిస్తున్న సమయంలో భాజపా ఎంపీ కమలేశ్ పాసవాన్​ మాట్లేడేందుకు ప్రయత్నించారు. దీంతో తాను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తానని, కమలేశ్​ను మాట్లాడేందుకు అనుమతిస్తున్నాని రాహుల్ అన్నారు. వెంటనే స్పీకర్ ఓం బిర్లా​ స్పందించారు. 'సభలో ఎవరూ మాట్లాడాలో వద్దో నిర్ణయించే హక్కు నాది, మీకు ఆ అవకాశం లేదు. మీరెవరు అనుమతి ఇవ్వడానికి' అని సభా నియమాలు గుర్తు చేశారు. ఆ తర్వాత రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:'గల్వాన్'​ ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details